ఒకప్పుడు రాజకీయాలలో తరుచుగా కనిచించే ఈ హుందాతనం ఇప్పుడు పూర్తిగా కనుమరుగయిపోతుంది. రాజకీయాలు అంటే కేవలం ఎన్నికల వరకే, ప్రభుత్వం – ప్రతిపక్షాల వాదనలు అంటే అసెంబ్లీ కే పరిమితం అనే నాటి నుంచి రాజకీయం అంటే వ్యక్తిగత దాడులు, బూతులు అనే స్థాయికి దిగజారిపోయాయి.
ఇటువంటి పరిస్థితులలో మొన్న తెలంగాణలో జరిగిన ఒక ఘటన తిరిగి వింటేజ్ రాజకీయాలను గుర్తుచేశాయి. తెలంగాణలో మొదలుకాబోతున్న మేడారం జాతర సంబరాలకు గాను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఆహ్వానించేందుకు కాంగ్రెస్ మహిళా మంత్రులు సీతక్క, సురేఖ కేసీఆర్ ఇంటికి వెళ్లారు.
కేసీఆర్ ఆయన సతీమణి కి ప్రభుత్వం తరుపున ఉత్సవాలకు ఆహ్వానిస్తున్నాం అంటూ ఆహ్వాన పత్రికను కేసీఆర్ దంపతులకు అందించారు మంత్రులు. కేసీఆర్ కూడా అంతే పెద్ద మనసుతో ఆ ఆహ్వానాన్ని స్వాగతిస్తూ తన ఇంటికి వచ్చిన ఆ ఇద్దరు మహిళా మంత్రులకు చీరలు బహూకరించి తెలుగు సంప్రదాయాలను రాజకీయాలలో ఆచరించి చూపించారు.
దీనితో ఇన్నాళ్లు ఉప్పు – నిప్పు అన్నట్టుగా సాగిన తెలంగాణ రాజకీయాలలో ఈ సంఘటన ఒక మంచి పరిణామంగా కనిపించింది. రాజకీయాలలో ఇటువంటి హుందాతనం కొనసాగితే అవి చూసేందుకు, స్వాగతించేందుకు ప్రజలు ఎప్పుడు సిద్దంగానే ఉంటారు అనేది ఈ సోకాల్డ్ రాజకీయ నేతలు గ్రహించాలి.
అయితే రెండేళ్ల తరువాత తెలంగాణ అసెంబ్లీ కి వచ్చిన కేసీఆర్ కొన్ని క్షణాల్లోనే తిరిగి వెళ్లిపోయారు, అయినా కూడా ప్రభుత్వం ఈగో కి పోకుండా తన బాధ్యతగా మాజీ ముఖ్యంమత్రిని ఇంటికి వెళ్లి ఆహ్వానించడం రేవంత్ తీసుకున్న మంచి నిర్ణయమని చెప్పాలి,
అలాగే పంతానికి వెళ్లకుండా తన ఇంటికి వచ్చిన వారి ఆహ్వానాన్ని స్వీకరించి జాతరకు వస్తానని చెప్పి, ఆ మహిళా మంత్రులకు కేసీఆర్ తన తరుపున చీరలు బహుకరించడం కూడా హర్షించదగ్గ అంశం. అయితే ఇదే తరహా రాజకీయాలు అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ లో కూడా అధికార – ప్రతిపక్షాల మధ్య కొనసాగాలని, అప్పుడే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుంది అంటున్నారు సామాన్య ప్రజానీకం.
గతంలో చంద్రబాబు నాయుడు – వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయం కూడా ఇంతే హుందాతనముగా కనిపించేది. అలాగే అటు బీజేపీ ప్రధానిమంత్రి అటల్ బిహారి వాజ్ పై సైతం తమ ప్రత్యర్థి పార్టీ నేతైనా ఇందిరా గాంధీ ధైర్యాన్ని కొనియాడారు. ఆ వింటేజ్ రాజకీయాలు ఇప్పటి తరం వారికి వింతగా, విడ్డురంగా అనిపించవచ్చు కానీ అవి ఎప్పటికి హుందాతనాన్నే కలిగి ఉంటాయి.






