మాజీ కాంగ్రెస్ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ఖచ్చితంగా మేధావే కానీ నిక్కచ్చిగా తన అభిప్రాయాలు చెప్పకుండా గోడ మీద పిల్లిలా వ్యవహరిస్తుంటారని చాలా మంది భావిస్తుంటారు. సోమవారం రాజమండ్రిలో మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు చంద్రబాబు నాయుడు శాసనసభలో అమరావతిని రాజధాని అని ప్రకటించినప్పుడు, ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి దానికి పూర్తి మద్దతు ఇచ్చారు. అధికార, ప్రతిపక్షాలు రెండూ అమరావతిని రాజధానిగా అంగీకరించినందున, భవిష్యత్‌లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అమరావతి నిర్మాణ పనులకు ఆటంకం లేకుండా సాగుతాయనే గట్టి నమ్మకంతోనే రాజధాని కోసం రైతులు తమ భూములిచ్చారు. కానీ ఆ రోజే జగన్మోహన్ రెడ్డి అమరావతిని గట్టిగా వ్యతిరేకించి ఉండి ఉంటే రైతులు భూములిచ్చేవారు కాదు. ఇంత నష్టపోయేవారు కాదు కదా? ఆనాడు అమరావతికి ‘యస్’ చెప్పిన జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే మూడు రాజధానుల ప్రతిపాదన చేసారు. దానిపై సుప్రీంకోర్టు నిర్ణయిస్తుంది. కనుక ఇప్పుడు నేను ఈ అంశం గురించి మాట్లాడదలచుకోలేదు.
పోలవరం ప్రాజెక్టు ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పడాన్ని నేను అభినందిస్తున్నాను. జనసేన పార్టీ ఒక్కసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేదు కనుక దాని గురించి పెద్దగా చెప్పుకోవలసిందేమీ లేదు. కనుక పవన్ కళ్యాణ్ గురించి నేను ఇప్పుడే ఏమీ మాట్లాడదలచుకోలేదు. హైదరాబాద్‌లో ఆయన ఇంటి వద్ద ఎవరైనా రెక్కీ నిర్వహించారా లేదా అనే దానిపై పోలీసులు ఏమీ చెప్పలేదు. కనుక అదొక వివాదాస్పదమైన అంశంగా భావిస్తున్నాను,” అని అన్నారు.
గత ప్రభుత్వం వేలకోట్లు ఖర్చు చేసి అమరావతిలో భారీ నిర్మాణాలు చేసింది. పైగా ఈ వ్యవహారం సుప్రీంకోర్టులో ఉంది కనుక ఆ ప్రాంతం రాజధానికి తగినదా కాదా? అనేది ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. అయితే ఉండవల్లి చెప్పినట్లుగా ఆనాడే జగన్ తాము అమరావతిని వ్యతిరేకిస్తున్నామని ధైర్యంగా చెప్పి ఉండి ఉంటే నేడు ఆయన విశ్వసనీయత పెరిగి ఉండేది. కానీ ఆనాడు తాము అమరావతిని వ్యతిరేకిస్తే అప్పుడు టిడిపి నేతలు జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని రాష్ట్ర ద్రోహులని గట్టిగా వాదిస్తారని, దాని వలన ప్రజలలో వైసీపీ పట్ల వ్యతిరేకత పెరిగి మరోసారి ఎన్నికలలో ఓడిపోవలసి వస్తుందనే భయం, దూరాలోచనతోనే అప్పుడు అమరావతికి జగన్ మద్దతు పలికినట్లు భావించవచ్చు.
కానీ అధికారంలోకి రాగానే జగన్ రాజధానిపై యు టర్న్ తీసుకోవడం వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. అయితే రాజధానిపై జగన్ తమ పార్టీ వైఖరి స్పష్టం చేశారు కనుక వచ్చే ఎన్నికలలో ‘అమరావతి వెర్సస్ మూడు రాజధానులు’ అంశం నిర్ణయాత్మకంగా మారుతుంది. ఈలోగా సుప్రీంకోర్టు కూడా అమరావతిపై తేల్చి చెప్పితే మరీ మంచిది. లేకుంటే రాష్ట్ర ప్రజలు అమరావతే కావాలనుకొంటే వచ్చే ఎన్నికలలో టిడిపికి మూడు రాజధానులు కావాలనుకొంటే వైసీపీకి ఓట్లు వేస్తారు.



