“ఒక దేశం..ఒక ఎన్నిక” అంటూ బీజేపీ దేశం మొత్తంలో ఒక పెద్ద రాజకీయ చర్చకు తెరలేపింది. ఈ నినాదం పై అటు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా భిన్న వాదనలు వినపడుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఏర్పడిన వంద రోజులకే బీజేపీ జమిలి ఎన్నికలను తెర మీదకు తేవడం వెనుక దాగిఉన్న ఆ రాజకీయ వ్యూహానికి అర్దాన్ని వెతికే పనిలో పడ్డారు రాజకీయ విశ్లేషకులు.
రాజకీయ పరంగా చూసుకుంటే ఈ జమిలి ఎన్నికల తంతుతో లాభపడేదెవరు.? నష్ట పోయేదెవరు.? అన్నదానిమీదే రాజకీయ పార్టీలు అంతర్గత చర్చలు మొదలుపెట్టాయి. అయితే ఈ ఎన్నికలు కేంద్ర ప్రభుత్వ కాలపరిమితి పూర్తయ్యే సమయంలో అంటే 2029 లో జరుపుతారా లేక అంతకంటే ఎంత సమయం ముందుకొచ్చి నిర్వహిస్తారా అనే చర్చ
అన్ని రాజకీయ పార్టీలలో జరుగుతుంది.
Also Read – ‘జేజమ్మ’ కొత్త అవతారం…!
అయితే తెలంగాణ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జమిలి ఎన్నికల మీద స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం పై కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికీ బీజేపీ నుండి సరైన సమాధానం వస్తే దాని మీద పార్టీలో చర్చించి జమిలి ఎన్నికల విధానం మీద తమ పార్టీ వైఖరిని స్పష్టం చేస్తామంటూ ప్రకటించారు. జమిలి ఎన్నికల కోసం దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దు చేస్తారా అంటూ కేటీఆర్ బీజేపీ ని ప్రశ్నించారు.
ఈ ప్రశ్న వెనుక కేటీఆర్ ముందు చూపు స్పష్టంగా కనిపిస్తుంది. ఒకవేళ బీజేపీ అవును రద్దు చేస్తాం అని చెప్పినట్లయితే ఇది వారికీ అనుకోని వరం గాను అందివచ్చిన అవకాశంగాను మలుచుకోవడానికి ఇప్పటి నుండి తమ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి పార్టీ శ్రేణులను అప్రమత్తం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంకాస్త దూకుడుగా వ్యవహరిస్తారన్న మాట.
Also Read – అప్పుడు వాలంటీర్లు… ఇప్పుడు సోషల్ మీడియా!
హైడ్రాతో హైద్రాబాద్ లో కూల్చివేతలు మొదలు పెట్టిన రేవంత్ సర్కారు అన్ని వర్గాల ప్రజల నుండి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల వద్ద నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటుంది. ఇటు బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరగడం కోసమే ఎదురు చూస్తుంది. సరైన అవకాశం చూసుకుని రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి సిద్ధంగా ఉంది.
అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలు విషయంలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తూ దూకుడు గా ముందుకు వెళ్లగలుతుంది. ఇటు ఏపీలో ప్రతిపక్షములో ఉన్న వైసీపీ ఇప్పటికే అధికార కూటమి పార్టీ మీద విమర్శలతో దూసుకుపోతుంది. ఇక మిత్రులిద్దరూ తమతమ ఉమ్మడి శత్రువు మీద బాణం ఎక్కు పెట్టడానికి తిరిగి అధికారం అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు.
Also Read – జగన్ హెచ్చరికలను లైట్ తీసుకుంటే…. ఫినిష్!
అయితే ప్రతిపక్ష పార్టీల హడావుడి ఇలా ఉంటె ఇక అధికార పార్టీ వ్యూహాలు ఇందుకు భిన్నంగా సాగుతాయి. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం ఆలోచనలకు తగ్గట్టే వన్ నేషన్ వన్ ఎలక్షన్ అమలు సాధ్యమయితే అధికారం అందుకున్న రాజకీయ పార్టీలు తమ ఐదేళ్ల అధికారాన్ని పూర్తి సమయం వినియోగించుకోలేక పోవచ్చు. దీనితో ప్రజలలో వచ్చే ప్రభుత్వ వ్యతిరేకత కాస్త తగ్గే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వాన్ని ఏ క్షణంలో అయినా రద్దు చేసి ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్రానికి ఉండడంతో అధికార పార్టీలన్నీ అందుకు తగ్గట్టుగా తమ రాజకీయ అడుగులు వేస్తాయి. అందులో భాగంగా అధికార పక్షాలు ముందు అభివృద్ధిని పక్కన పెట్టి ఎన్నికల ప్రచారంలో ప్రజలకిచ్చిన సంక్షేమ హామీల మీద ద్రుష్టి కేంద్రికరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
తద్వారా ప్రభుత్వం ప్రజలకిచ్చిన వాగ్దానాలు నిలుపుకున్నట్లు అవుతుంది.దీని కోసం అప్పులు చేసైనా, నానా తిప్పలు పడైన ఎన్నికల హామీలన్ని నెరవేర్చి తిరిగి ప్రజలలలోకెళ్ళి ఓటు అడిగి ప్రతిపక్షాలను కట్టడి చేసే అవకాశాన్ని పొందాలని ఆశ పడతాయి. అయితే ఇందులో ఎవరి లాభాలు వారికంటే, ఎవరి బొక్కలు వారికున్నాయి. వాటిని సరైన పద్డతిలో ఎవరు వినియోగించుకో గలుగుతారో వారే ఈ జమిలి ఎన్నికల లబ్ది దారులవుతారు.
ఇది ఒక్క రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీలకే కాదు యావత్ దేశంలోని అన్ని అధికార, ప్రతిపక్ష పార్టీలకు కూడా వర్తిస్తుంది. ప్రతిపక్షాలు అవకాశం కోసం ఎదురు చూస్తే, ప్రభుత్వాలు వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడానికి చూస్తాయి.