ఎవరి కోసం జై తెలంగాణ నినాదం?

Why BRS Keeps Using the Jai Telangana Slogan

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలలో పోరాటస్పూర్తి నింపేందుకు జై తెలంగాణ నినాదం చాలా అవసరమైంది. కానీ తెలంగాణ ఏర్పడిన 11 ఏళ్ళ తర్వాత కూడా బీఆర్ఎస్‌ పార్టీ నేతలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తదితరులు మట్లాడే ముందు తర్వాత ‘జై తెలంగాణ’ అంటూ నినాదం చేస్తుంటారు.

ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అంటారు. లేదా మా రాష్ట్రానికి మేము జై కొట్టుకుంటే మీకెందుకు అసూయ? అని ఎదురు ప్రశ్న వేస్తారు.

ADVERTISEMENT

కానీ తెలంగాణలోనే కాంగ్రెస్‌, బిజేపి, వామపక్షాలు కూడా ఉన్నాయి. ఆ పార్టీల నేతలు ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేయరు. కానీ సమయం సందర్భంవస్తే తప్పకుండా ‘జై తెలంగాణ’ అంటారు. అంటే తెలంగాణ పట్ల కేవలం బీఆర్ఎస్‌ పార్టీ, తెలంగాణ జాగృతికి మాత్రమే అభిమానం ఉంది మిగిలినవారెవరికీ లేనట్లా? అంటే కాదనే అర్ధమవుతోంది.

ఏపీలో వైసీపీ, కూటమి ప్రభుత్వం, కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నీ కూడా ఆంధ్రా ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నాము… పోరాడుతున్నామని చెప్పుకుంటాయి. కానీ ఎవరూ చీటికీ మాటికి ‘జై ఆంధ్రా’ అంటూ నినాదాలు చేయరు.

దేశంలో ఇతర రాష్ట్రాలలో అధికార విపక్ష పార్టీలు, వాటి నేతలు అందరూ తమతమ రాష్ట్రాల కోసమే పనిచేస్తుంటారు. కానీ చీటికీ మాటికీ తమ రాష్ట్రానికి జై కొట్టరు. ఒక్క బీఆర్ఎస్‌, జాగృతి నేతలు మాత్రమే ‘జై తెలంగాణ’ నినాదాలు చేస్తుంటారు. ఎందుకు?

అంటే తెలంగాణ ప్రాంతీయవాదం బలంగా ఉంచుకోవడం వారి రాజకీయ మనుగడకు చాలా ముఖ్యం కనుక. అందుకే వారు ప్రజలలో ‘తెలంగాణ సెంటిమెంట్’ చల్లారిపోకుండా కాపాడుకొస్తుంటారు. అందుకే ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని, ప్రధాని మోడీని, కాంగ్రెస్‌, బిజేపిలని బూచిగా చూపిస్తుంటారు.

తెలంగాణను చుట్టుముట్టిన ఈ శత్రువుల వలన చాలా ప్రమాదం పొంచి ఉందని, ఈ శత్రువుల బారి నుంచి మేము మాత్రమే కాపాడగలం అని నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు.

దీనినే సినిమా భాషలో చెప్పుకుంటే విలన్ లేకపోతే హీరోయిజం ఎలివేషన్ చాలా కష్టం. కనుక విలన్ ఉండాలి. చాలా బలంగా, చాలా క్రూరంగా ఉండాలి. అలాంటి శక్తివంతుడైన విలన్‌తో హీరో వీరోచితంగా పోరాడాలి… ఓడించేయాలి. అప్పుడే థియేటర్లో చప్పట్లు పడతాయి. అప్పుడే ప్రేక్షకులు హీరోని… ఆ సినిమాని గెలిపిస్తారు.

తెలంగాణలో బీఆర్ఎస్‌, జాగృతి నేతలు కూడా అచ్చం ఇదే ఫార్ములాతో జై తెలంగాణ అంటూ దూసుకు పోతున్నారని చెప్పవచ్చు.

కల్వకుంట్ల కవిత తాజా ఇంటర్వ్యూలో ఇదే ప్రశ్న ఎదురైనప్పుడు ఆమె ఏమన్నారంటే, “మాట్లాడితే తెలంగాణ తెలంగాణ… అంటారేమిటి మీరందరూ అని చాలా మంది అడుగుతుంటారు మమ్మల్ని. మేము పనిచేసేదే తెలంగాణ రాష్ట్రం ప్రజల కోసం.. కనుక తెలంగాణ అంటూనే ఉంటాము,” అని జవాబు చెప్పారు.

ఆమె జవాబు విన్నప్పుడు ఈ మాటకారితనంతోనే కల్వకుంట్ల కుటుంబంలో అందరూ నెగ్గుకొస్తున్నారనిపించక మానదు!

ADVERTISEMENT
Latest Stories