విజయశాంతి నేటికీ సినిమాలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. కళ్యాణ్ రామ్ హీరోగా వస్తున్న ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతీ’ సినిమాలో ఆమె కళ్యాణ్ రామ్‌కు తల్లిగా, పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నారు.
ఇన్ని దశాబ్ధాల తర్వాత కూడా నేటికీ సినీమాలలో ఆమె తన స్థానం నిలబెట్టుకోగలిగారు కానీ తెలంగాణ రాజకీయ పార్టీలు ఆడుతున్న రాజకీయ చదరంగంలో ఓ పావుగానే మిగిలిపోయారు. ఎన్ని పార్టీలు మారినా పెద్దగా రాణించలేకపోయారు.
నిజానికి సినీ పరిశ్రమ నుంచి వెళ్ళిన జయసుధ, జయప్రద వంటివారు సైతం సముచిత పదవులు, గౌరవం, ప్రాధాన్యం పొందలేకపోయారనే చెప్పొచ్చు. వారే కాదు చిరకాలంగా రాజకీయాలలో ఉన్న మహిళా రాజకీయ నేతలు సైతం రాజకీయాలలో పురుషాధిక్యత కారణంగా సముచిత పదవులు, ప్రాధాన్యత పొందలేకపోయారనే చెప్పక తప్పదు.
కనుక సినీ పరిశ్రమ నుంచి వచ్చిన విజయశాంతి వంటివారి స్టార్ ఇమేజ్‌ని పార్టీలు ఉపయోగించుకున్నాయి తప్ప వారి స్థాయికి తగిన పదవి, ప్రాధాన్యత ఇవ్వలేదనే చెప్పొచ్చు. కనుక విజయశాంతి కూడా అలాగే రాజకీయాలలో వెనుకబడిపోయారు.
అయితే సినిమా ఇంటర్వెల్ బ్యాంగ్ లేదా క్లైమాక్స్ సన్నివేశంలో హీరో ఎంట్రీ ఇచ్చిన్నట్లు, విజయశాంతి కూడా కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పి ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు. ఊహించని ఈ పరిణామానికి కాంగ్రెస్ పార్టీలో వారే ఆశ్చర్యపోయారు.
ఇప్పుడు ఆమె మరో మెట్టు ఎక్కబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 3న సిఎం రేవంత్ రెడ్డి నలుగురు మంత్రులతో మంత్రి వర్గ విస్తరణ చేపట్టబోతున్నారు. ఆ జాబితాలో విజయశాంతి పేరు లేదు. కానీ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తరచూ వివాదాలలో చిక్కుకొని పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిస్తున్నందున ఆమెను తొలగించి ఆ స్థానంలో విజయశాంతిని నియమించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఒకవేళ సిఎం రేవంత్ రెడ్డి ఆమెను మంత్రివర్గంలోకి తీసుకుంటే, ఇన్నేళ్ళ తర్వాత ఆమెకు సముచిత స్థానం, గౌరవం లభించిన్నట్లవుతుంది. మంత్రి పదవి చేపడితే అప్పుడు విజయశాంతి తన సమర్దత నిరూపించుకునే అవకాశం కూడా లభిస్తుంది. కనుక విజయశాంతి ప్రస్తుత కర్తవ్యం మరో మెట్టు ఎక్కడమే. ఎక్కుతారో లేదో త్వరలో తెలుస్తుంది.




