చైనా అధ్యక్షుడు షి జిన్ పింగ్ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ని ఉద్దేశ్యించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గే లావ్రోవ్ బుధవారం బీజింగ్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయనతో షి జిన్ పింగ్ సమావేశమైనప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
రాన్రాను ట్రంప్ దూకుడు ఎక్కువైపోతోందని, ఆయనని కట్టడి చేసేందుకు ఐఖ్యరాజ్య సమితిని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని షి జిన్ పింగ్ అన్నారు. దీని కోసం రష్యా తమతో కలిసి రావాలన్నారు. రెండు దేశాలు కలిసి ఐఖ్యరాజ్య సమితి ద్వారా అంతర్జాతీయ నిబంధనలు అమలయ్యేలా చేయాల్సిన అవసరం ఉందన్నారు.
చైనా, రష్యాలు రెండు యుద్ధోన్మాద, సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన దేశాలే. ఐఖ్యరాజ్య సమితి, నాటో హెచ్చరికలు, అంతర్జాతీయ నిబంధనలన్నిటినీ రష్యా తుంగలో తొక్కి, గత నాలుగేళ్ళుగా ఉక్రెయిన్‌పై దాడులు చేస్తూనే ఉంది. అమెరికాతో సహా మరే దేశమైనా ఉక్రెయిన్‌కి మద్దతుగా యుద్ధానికి వస్తే అణు బాంబులు ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని రష్యా హెచ్చరించింది.
చైనా విషయానికి వస్తే అది భారత్‌లోని అరుణాచల్ ప్రదేశ్‌తో పలు ప్రాంతాలు తమవేనని వాదిస్తుంటుంది. అప్పుడప్పుడు చొరబాట్లకు ప్రయత్నిస్తుంటుంది. తైవాన్ తమ దేశంలో భాగమే అని వాదిస్తుంది. అలాగే ఫిలిపిన్స్, జపాన్ దేశాలకు చెందిన ద్వీపాలపై కూడా ఆధిపత్యం చలాయించాలని చూస్తుంటుంది.
అంతేకాదు.. పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వంటి దేశాలకు ఆర్ధిక సాయం అందిస్తూ వాటిని తన గుప్పెట్లో పెట్టుకుని భారత్‌కు వ్యతిరేకంగా ఉసిగొల్పుతుంటుంది. గత ఏడాది భారత్-పాక్ మద్య నాలుగు రోజుల పాటు జరిగిన యుద్ధంలో పాక్ ప్రయోగించిన డ్రోన్లు వగైరా చైనా అందించినవే.
ఇలాంటి యుద్ధోన్మాదం, సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన చైనా, రష్యాలు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదాన్ని తప్పు పట్టడం, అంతర్జాతీయ నిబంధనలు అమలుకావాలని అనడం చాలా హాస్యాస్పదంగా ఉంది కదా?






