మేమూ డైరీలు రాసుకుంటున్నామోచ్!

YS Jagan

జగన్‌ 5 ఏళ్ళ పాలనలో టిడిపి నేతలు, కార్యకర్తలు నరకం చూశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడినే అరెస్ట్ చేసి జైల్లో పెట్టించిన ఘనుడు జగన్మోహన్‌ రెడ్డి. ఆ దెబ్బతో టిడిపి మూతపడిపోవడమో నేతలు, కార్యకర్తలు చెల్లాచెదురు అయిపోవడమో ఖాయమని జగన్‌ భావించారు.

కానీ చంద్రబాబు నాయుడు చాలా గుండె నిబ్బరంతో వ్యవహరిస్తూ, పార్టీని చెల్లాచెదురు కాకుండా ఒకటీ రెండూ కాదు ఏకంగా 5 ఏళ్ళపాటు కాపాడుకుని వైసీపిని ఓడించి అధికారంలోకి వచ్చారు కూడా.

ADVERTISEMENT

అయితే ఆయనకి ఉన్నంత సహనం నాకు లేవని నారా లోకేష్‌ కుండబద్దలు కొట్టిన్నట్లు చాలా స్పష్టంగానే చెప్పారు. వైసీపికి మాటకి మాట, దెబ్బకి దెబ్బ తీస్తానని చెప్పారు. చెప్పడమే కాదు… తమని వేదిస్తున్న వైసీపి నేతలు, అధికారుల పేర్లను ఎర్ర డైరీలో ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ, తాము అధికారంలోకి రాగానే ఆ డైరీలో పేర్లున్న అందరి భరతం పడతానని యువగళం పాదయాత్రలో బహిరంగంగానే హెచ్చరించేవారు.

అధికారంలో వచ్చిన కొత్తలో సిఎం చంద్రబాబు నాయుడు పలు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను పక్కన పెడుతున్నప్పుడు ఆ ఎర్ర డైరీ బయటకు తీసిన్నట్లే అనిపించింది. కానీ ఆ తర్వాత ఎర్ర డైరీని లోపల పడేశారని, అందుకే జగన్‌తో సహా ఆ పార్టీలో అందరూ ఇంతగా రెచ్చిపోతున్నారని టిడిపి నేతలు, కార్యకర్తలు రోజూ వాపోతుండటం అందరూ వింటూనే ఉన్నారు.

సిఎం చంద్రబాబు నాయుడు దృష్టి అంతా అమరావతి, పోలవరం నిర్మాణం, పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షించి రాష్ట్రాభివృద్ధి చేసుకోవడం పైనే ఉంది. అందువల్లే జగన్‌తో సహా వైసీపి నేతలందరూ ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. ఎదురుదాడి చేయగలుగుతున్నారు కూడా.

ఆయనపై ఎదురుదాడి చేస్తున్న జగన్మోహన్‌ రెడ్డి, తమని టిడిపి నేతలు, అధికారుల వేధిస్తున్నారని, వారి పేర్లను తాము కూడా నోట్ చేసుకుంటున్నామని చెప్పడం చాలా హాస్యస్పదంగా ఉంది.

తన ప్రమేయం లేకుండానే వైసీపి నేతలందరూ తలో డైరీ వ్రాయడం మొదలుపెట్టారని జగన్‌ చెప్పారు. తాను మాత్రం ఈ కష్టకాలంలో వైసీపి కోసం శ్రమిస్తున్న కార్యకర్తల పేర్లను, వారికి అండగా నిలుస్తున్న వైసీపి నేతల పేర్లను డైరీలో వ్రాసుకుంటున్నానని జగన్‌ చెప్పారు. మళ్ళీ తాను అధికారంలో వచ్చిన తర్వాత వారందరికీ తగిన గౌరవం, ప్రాధాన్యత ఇస్తానని జగన్‌ చెప్పారు.

పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న నేతలను, కార్యకర్తలను అధిష్టానం గుర్తించడం, వారికి అండగా నిలబడటం చాలా అవసరమే. అందుకు జగన్‌ని తప్పకుండా అభినందించాలి.

కానీ కార్యకర్తల వద్దకు వెళ్ళి వారి కష్టానష్టాలను తెలుసుకొని అండగా నిలబడాల్సిన జగన్మోహన్‌ రెడ్డి ప్యాలస్‌ గుమ్మం దాటి అడుగు బయట పెట్టడమే లేదు. పదవీ అధికారం రెండూ కోల్పోయినా నేటికీ తనను కలిసేందుకు వచ్చే పార్టీ ముఖ్య నేతలకి అపాయింట్మెంట్ ఇవ్వకుండా తిప్పించుకున్నారు.

అధికారంలో లేనప్పుడే ఈవిదంగా వ్యవహరిస్తున్నప్పుడు, ఒకవేళ మళ్ళీ అధికారంలో వస్తే ఎవరైనా జగన్‌ కంటికి ఆనుతారా?

అయినా ఎన్ని డైరీలు వ్రాసుకున్నా మళ్ళీ అధికారంలోకి రావాలి కదా? జగన్‌కి ప్రజలు మళ్ళీ ఛాన్స్ ఇస్తారా? చంద్రబాబు నాయుడు ఇవ్వనిస్తారా? కనుక ప్యాలస్‌లో కూర్చొని ఎన్ని డైరీలైన వ్రాసుకోవచ్చు. ఎవరికీ అభ్యంతరం లేదు.

ADVERTISEMENT
Latest Stories