గుంతలు పూడ్చలేని ప్రభుత్వం రాజధాని నిర్మించగలదా? పోలవరం పూర్తి చేయగలదా?అని విజయనగరం జిల్లాలోని టిడిపి నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. సాలూరు, నెల్లిమర్ల, కొమరాడలో టిడిపి నేతల అధ్యర్యంలో శుక్రవారం బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయి.
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి అధ్వర్యంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, కౌన్సిలర్లు హర్ష, లక్ష్మోజీ, శోభారాణి, సీతమ్మ, అప్పాయమ్మ, దబ్బి కృష్ణ తదితరులు సాలూరు పట్టణంలోని 9,19వ వార్డులలో ఇంటింటికీ వెళ్ళి ‘జగనన్న నవమోసాలు’ పేరుతో కరపత్రాలు పంచారు.
ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నవరత్నాల పేరుతో జగన్ ప్రభుత్వం నవమోసాలకు పాల్పడుతోంది. పధకాలు ఇచ్చిన్నట్లే ఇచ్చి అన్నిటి ఛార్జీలు పెంచేసి ఆ సొమ్మును ప్రజల నుంచే ముక్కు పిండి వసూలు చేసుకొంటోంది. మూడేళ్ళలో ఒక్క గుంతను కూడా పూడ్చలేని జగన్ ప్రభుత్వం రాజధాని నిర్మించగలదా? పోలవరం పూర్తి చేయగలదా?మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతున్న జగన్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో మీరే తగిన విదంగా బుద్ధి చెప్పాలి,” అని అన్నారు.
నెల్లిమర్లలో రామతీర్దం వద్ద మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు, టిడిపి మండల అధ్యక్షుడు కడగల ఆనంద్ కుమార్, అధ్వర్యంలో బాదుడే బాదుడు నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పతివాడ తమ్మినాయుడు, టిడిపి రాష్ట్ర ఎస్సీ సంఘం నాయకుడు రాజప్పన్న తదితరులు పాల్గొన్నారు.
కొమరాడ మండలంలోని కోటిపాం, పెదఖేర్జీ గ్రామాలలో శుక్రవారం టిడిపి కురుపాం నియోజకవర్గం ఇన్-చార్జీ తోయక జగదీశ్వరి నేతృత్వంలో జరిగిన బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.



