‘పూర్వ జన్మలో ఏం పాపం చేసామో ఈ జన్మలో ఇలాంటోడు పుట్టాడు’ అని సహజంగా ఇళ్లల్లో మాట్లాడుకుంటుంటారు. గత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుణ్యమా అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇదే వర్తిస్తుందనే విధంగా ప్రస్తుత సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు నిలుస్తున్నాయి.
నేడు పోలవరం సందర్శించి ఎంతో ఆవేదనను వ్యక్తం చేసిన చంద్రబాబు, “ఏపీకి జగన్ ఓ శాపం, ఓ వ్యక్తి రాష్ట్రానికి శాపంలా మారితే ఎలా ఉంటుందో అని చెప్పడానికి పోలవరం ఓ ఉదాహరణ” అంటూ జగన్ అయిదేళ్ల పర్వాన్ని ప్రజల ముందుంచే ప్రయత్నం చేసారు.
2019 నుండి కొనసాగిస్తే ఓ రెండేళ్లలో ప్రాజెక్ట్ మొత్తం పూర్తయ్యి ఉండేదని, ఇప్పుడు అంచనాలకు మించిన ఖర్చుతో పాటు, అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా జరిగితే తప్ప నాలుగేళ్లల్లో పూర్తయ్యే సూచనలు లేవని పోలవరం గురించి వివరించారు.
జగన్ చేసింది చిన్న తప్పు కాదని, ఇది క్షమించరాని నేరం ఇదని, అసలు రాజకీయాల్లో ఉండడానికే అర్హత లేని వ్యక్తిగా జగన్ ను ప్రకటించారు. నేటితో 31వ సారి వచ్చిన తాను పోలవరం పూర్తి అనేది తన కల అని, ఖచ్చితంగా పోలవరంను పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
సీఎం పీఠం ఎక్కి మొదటగా సమీక్ష చేసిన పోలవరం ప్రాజెక్ట్ గురించే చంద్రబాబు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తే, మున్ముందు రాజధానితో సహా ఇతర శాఖలలో నిర్వహించే సమీక్షలలో, అందులో వెలుగులోకి వచ్చే విషయాలపై ఇంకెంతలా స్పందిస్తారో చూడాలి. “జగన్ ఏపీకి హానికరం” అనే నినాదం రానున్న రోజుల్లో హెడ్ లైన్స్ లో ఉండే అవకాశం లేకపోలేదు.




