ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఒకటో తారీకు వస్తోందంటే దడే. ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు 1వ తేదీన కాదు కదా 15వరకు కూడా జీతాలు చెల్లించలేకపోతోంది. దాంతో వారు రోడ్లపైకి జీతాలు చెల్లించండి మహాప్రభో ఆందోళనలు మొదలుపెడుతుంటారు. ఆ తర్వాత ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల సంఘాల నేతలు ప్రెస్‌మీట్ పెట్టి ప్రభుత్వ తీరుని ఎండగడుతుంటారు. ఏపీలో గత రెండు మూడు నెలల నుంచి ప్రతీనెల ఇలాగే జరుగుతుండటంతో కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంటులో ఈ విషయం ప్రస్తావించారు. అంటే జీతాల చెల్లింపు కూడా ఓ సమస్యగా మారిపోయి పార్లమెంట్ వరకు వెళ్ళిపోయిందన్న మాట! అయితే సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు ఎవరూ కూడా ఈ సమస్యపై మీడియా ముందుకు వచ్చి మాట్లాడకుండా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేత ఎప్పటికప్పుడు ఏదో స్టోరీ చెప్పిస్తున్నారు.
ఇవాళ్ళ 27వ తేదీ అంటే మళ్ళీ జీతాలు చెల్లింపులకి డేట్ దగ్గర పడుతోందన్న మాట! కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీ ప్రయాణం అవుతున్నారు. రాష్ట్రానికి సంబందించిన అంశాలు, విభజన హామీల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించడానికి వెళుతున్నారని చెప్పుకొంటునప్పటికీ అప్పులు, నిధుల విడుదల చేయాలని కోరేందుకే అని రేపో ఎల్లుండో కేంద్రం చేయబోయే ప్రకటనతో తెలుస్తుంది. నెలనెలా ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలతో పాటు, రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్లు, వృద్ధాప్య పింఛన్లు వగైరాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇవికాక తలకు మించిన భారం ఎత్తుకొన్నందుకు సంక్షేమ పధకాలు ఉండనే ఉన్నాయి. వాటికీ నెలనెలా బటన్ నొక్కి విడుదల చేయాల్సి ఉంటుంది. లేకుంటే లబ్దిదారులకి ఆగ్రహం కలుగుతుంది. నేడు సిఎం జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి వివిద పధకాల కింద లబ్దిదారులకు చెల్లించాల్సిన రూ.590.91 కోట్లు విడుదల చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇలా అన్నీ ఖర్చులే తప్ప ఆదాయం కనిపించడం లేదు. కనుక పన్నులవాటాలో ఏపీకి వచ్చే సొమ్ము ఏమాత్రం సరిపోవడం లేదు. ఇప్పటికే ఏపీ అప్పులు మేట వేసి ఉండటంతో కొత్తగా అప్పులు పుట్టడం కష్టమవుతోంది. కనుక నెలనెలా సిఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి సంబందించిన అంశాలు, విభజన హామీల గురించి ప్రధాని నరేంద్రమోడీతో చర్చించడానికి ఢిల్లీ వెళ్ళక తప్పడం లేదు.



