గత మూడేళ్ళుగా ఆంధ్రప్రదేశ్‌ని చూస్తున్నవారు “ఈ రాష్ట్రానికి ఏమైంది? ఎప్పుడూ రాజకీయాలేనా?అభివృద్ధి గురించి ప్రభుత్వం అసలు ఆలోచించదా?ఈ లెక్కన ఏపీ ఎప్పటికి బాగుపడుతుంది?బాగుపడటం మాట అటుంచి శ్రీలంకలా మునిగిపోకుండా ఉంటుందా?” అని అనుకొంటున్నారు.
అయితే ఎవరేమనుకొన్నా ‘మా కుందేలుకి మూడే కాళ్ళు…అభివృద్ధి అంటే సంక్షేమమే. దానికి అడ్డుపడటం అంటే అభివృద్ధికి అడ్డుపడటమే’ అని వైసీపీ ఏకగ్రీవంగా తీర్మానించేసింది. కనుక వైసీపీ ప్రభుత్వం ముందు ఇప్పుడు రెండు అతి పెద్ద సవాళ్ళు ఉన్నాయి.
1. ఆంధ్రప్రదేశ్ శరవేగంగా వెనక్కి నడిపించేస్తూ శ్రీలంకగా మార్చడం.
2. తమ ‘వైసీపీ మార్క్ అభివృద్ధి’కి డ్డుపడుతున్న అభివృద్ధి నిరోధకులను అడ్డుకొని వారి నుంచి తమ పార్టీని కాపాడుకోవడం.
వాటిలో మొదటి పని మూడేళ్ళ క్రితమే ప్రారంభించేసింది కనుక శ్రీలంకకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూతవేటు దూరంలోనే ఉందనిపిస్తోంది. ఇక రెండోదానికి అంటే వైసీపీ ప్రభుత్వానికి ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ ప్రభుత్వాన్ని అధికారులకు, ఐఏఎస్ అధికారులను కోర్టుకి అప్పజెప్పేసి మంత్రులు, ఎమ్మెల్యేలు గడప గడపకు తిరుగుతున్నారు.
రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడకపోవచ్చునేమో కానీ ముఖ్యమంత్రి మాత్రం వారం వారం క్రమం తప్పకుండా తన ఓటు బ్యాంకుపై సంక్షేమ పధకాల వరాల జల్లులు కురిపిస్తూనే ఉన్నారు. పనిలో పనిగా ‘సంక్షేమం అలియాస్ అభివృద్ధి’ నిరోధకులను శపించేస్తున్నారు కూడా.
నిన్న ఏలూరు జిల్లా గణపవరంలో జరిగిన సభలో సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి చంద్రబాబు నాయుడుని, పవన్ కళ్యాణ్ పేర్లను మనసారా స్మరించుకొని మాట్లాడుతుండగా ప్రజలు లేచి వెళ్ళిపోసాగారు. పోలీసులు, వైసీపీ వాలంటీర్లు వారికి నచ్చే జెప్పి కూర్చోపెట్టేందుకు ప్రయత్నించినా వెళ్ళిపోయారు.
ఈ సభ నాలుగో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ఏర్పాటు చేసినది. కానీ ఆ సభలో నుంచి కూడా ప్రజలు లేచి వెళ్ళిపోవడంతో తన సంక్షేమ రాజ్యం గురించి ప్రజలు ఏమనుకొంటున్నారో ప్రత్యక్షంగా చూసే భాగ్యం ముఖ్యమంత్రికే దక్కింది.
ఇందుకు రేపు ఎవరు బలవుతారో తెలీదు కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి భోళాశంకరుడు వంటి పవన్ కళ్యాణ్‌ను స్మరించుకోగానే ఆయన వెంటనే ట్విట్టర్‌లో ప్రత్యక్షమయ్యి భక్తా, “శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం-శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం. ఇంకా లేని పొత్తులు గురించి విమర్శించటం, గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది, మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి,” అని హితవు పలికారు.
శ్రీలంక నుంచి తమిళనాడుకి గంట దూరం- శ్రీలంక పరిస్థితికి ఆంధ్రప్రదేశ్ కూతవేటు దూరం.ఇంకా లేని పొత్తులు
గురించి విమర్శించటం,గడప గడపకి ఎమ్మెల్యేలని పంపటం కాదు చెయ్యవలసింది,మీరు చేసిన అప్పులు నుంచి ఆంధ్రప్రదేశ్‌ని దూరం జరిపే ప్రయత్నం చెయ్యండి.
Gravitas Link:https://t.co/b5S8kN721c pic.twitter.com/GoaUa5g0UR— Pawan Kalyan (@PawanKalyan) May 16, 2022



