కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, గుమ్మటం తండా వద్ద సిఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఇంటిగ్రేటడ్ రెన్యుబల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. రూ.15,000 కోట్లు వ్యయంతో 5,410 మెగావాట్స్ విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యంతో దీనిని గ్రీన్ కోఎనర్జీస్ లిమిటెడ్ నిర్మించబోతోంది. ఈ ప్లాంటులో సోలార్, విండ్, హైడల్ మూడు విధాల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది.
ఇదెలా ఉందంటే దాహం వేస్తే నుయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లుంది. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఏర్పడి విద్యుత్ కోతలు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించే పరిస్థితి వస్తేగానీ విద్యుత్ ఉత్పత్తి సంస్థలను ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచన ప్రభుత్వానికి రాలేదు. ఎందుకంటే, ప్రభుత్వం దృష్టి ఎంతసేపు సంక్షేమ పధకాలు, వాటికి ఎక్కడి నుంచి ఎలా అప్పులు తెచ్చుకోవాలనేదానిపైనే ఉండటం కారణంగా కనిపిస్తోంది.
అదే…ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుకే తొలి ప్రాధాన్యత ఇచ్చి ఉంటే ఈ మూడేళ్ళలో ఇటువంటివి అనేకం వచ్చి ఉండేవి. విద్యుత్ కొరత కూడా ఉండేది కాదు కదా?
ఏది ఏమైనప్పటికీ, గత మూడేళ్ళుగా సంక్షేమ పధకాలు, ప్రతిపక్షాలపై కక్ష సాధింపులు, మంత్రుల బూతులు తప్ప మరోటి వినే భాగ్యానికి నోచుకోని ఏపీ ప్రజలు, సిఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ్ళ ఓ నిర్మాణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండటం చూసి తప్పక సంతోషిస్తారు.
మూడు రాజధానుల పాటలో ‘కర్నూలు న్యాయ రాజధాని’ పల్లవిని వినివినీ మురిసిపోయిన జిల్లా ప్రజలకు టిడిపి కుట్రల కారణంగానే నేను తరువాత చరణం పాడలేకపోతున్నానని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవచ్చు. కనుక కనీసం ఈ ఇంటిగ్రేటడ్ రెన్యుబల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టునైనా తన పదవీకాలం ముగిసేలోగా పూర్తి చేయించి అప్పజెప్పితే చాలా సంతోషిస్తారు.
కొత్తగా బాధ్యతలు చేపట్టిన మంత్రులు ఇంకా ఆ ముచ్చట తీరక మునపే తమ పనులను, బాధ్యతలను అధికారులకు అప్పగించేసి మళ్ళీ గడప గడపకు తిరగాల్సివస్తోంది. మిగిలిన ఈ రెండేళ్ళలో కనీసం ఈ ఒక్క ఏడాది అందరూ గట్టిగా పనిచేస్తే చాలు…ఇలాంటి ప్రాజెక్టులు, పరిశ్రమలు రాష్ట్రానికి చాలానే తీసుకురావచ్చు. కానీ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా ఇప్పటి నుంచే గడపలు పట్టుకొని తిరగమంటే రాష్ట్రం ఏవిదంగా అభివృద్ధి సాధించగలదు?
నరేంద్రమోడీ గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపి దేశ ప్రజల మనసులు గెలుచుకొని ప్రధాని కాగలిగారు. సిఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపించి తాను కూడా ప్రధానమంత్రి కావాలనుకొంటున్నారు.
వైసీపీ నేతలు కూడా తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని ప్రధానిగా చూడాలనుకొంటున్నారు. కనుక ఈ రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్‌ను ఎంతో కొంత అభివృద్ధి చేసి చూపిస్తే అటువంటి గొప్ప అవకాశం జగన్మోహన్ రెడ్డికి కూడా లభిస్తుందేమో?



