ఇది ఇవివి సత్యనారాయణ దర్శకత్వం వహించిన “అమ్మో 1వ తారీఖు” సినిమా గురించి కాదండోయ్! వెండితెరపై కాదు, నిజజీవితంలో ప్రభుత్వ ఉద్యోగులు ఒకటో తారీఖు అనేపాటికి భయపడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ భయానికి కారణం ఉంది, గత కొన్ని నెలలుగా ప్రభుత్వం ఇవ్వాల్సిన జీతభత్యాలు సరైన సమయానికి లభించకపోవడం ఓ కారణమైతే, భవిష్యత్తు మరింత అంధకారంగా ఉంటుందేమో అన్న సంకేతాలకు తావునిచ్చేలా ఓ వార్త హల్చల్ చేస్తోంది.
ప్రతి నెలా ఎక్కడోకచోట అప్పు తీసుకువచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించే ఆర్ధిక స్థితిలో ఏపీ ఉందని స్వయంగా వారి ఎమ్మెల్యేలు, ఎంపీలే చెప్తున్న పరిస్థితి. ఈ స్థితిలో అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలు నిలిపేయండి గానీ, ఎట్టి పరిస్థితిలో సంక్షేమ పధకాలు అమలు చేయాల్సిందేనని జగన్ ఆర్ధిక శాఖ అధికారులకు హుకుం జారీ చేసినట్లుగా ఓ మీడియాలో ముద్రించిన ప్రచురణ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కేంద్రం ఏదొక ఆర్ధిక సాయం అందిస్తే తప్ప నవరత్నాలు అమలు చేయాలంటే ప్రస్తుతమున్న పరిస్థితిలో సాధ్యం కాదన్న అధికారుల మాటలకు ప్రతిగా జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఈ ప్రచురణ సారాంశం. పధకాలు అమలు చేయలేని పక్షంలో ప్రభుత్వాన్ని రద్దు చేయడానికి కూడా వెనుకాడబోననే వ్యాఖ్యలు జగన్ ఓ అధికారికి చెప్పినట్లుగా ఇందులో ముద్రించారు. పధకాల అమలులో రాజీపడే ఉద్దేశం లేదని, వాటిని అమలు పరచాల్సిందేనని స్పష్టం చేసిన జగన్ మాటలు అధికారుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి.
ఇతర సంచలన విషయాలు ఎలా ఉన్నా, ఈ కధనం చూసి “అమ్మో ఒకటో తారీఖు” అంటూ భయపడిపోవడం ప్రభుత్వ ఉద్యోగుల వంతవుతోంది. అసలే రాబోయేది 2022 నూతన సంవత్సరం. కొత్త సంవత్సరంలో ఏపీ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ ట్విస్ట్ ఇవ్వనుందా? ఇప్పటికే పీఆర్సీ అమలు విషయంలో నిరసనలు వ్యక్తం కాగా, ఇపుడు ఏకంగా జీతాలకే ఎసరు పెట్టే పరిస్థితి వస్తే, ఇంకా పీఆర్సీ మాటకు విలువ ఏముంటుంది? ఇలా రకరకాల ప్రశ్నలతో ఉద్యోగులు తలమునకలై ఉన్నారు.
source:
https://pbs.twimg.com/media/FG-DmXZXoAA6avy?format=jpg&name=medium



