YS Jagan

వై నాట్ 175 అనేదే వైసీపీ ఎన్నికల నినాదంగా ముందుకెళ్తే ఏపీ ఓటర్లు మాత్రం వై నాట్ 15 అంటూ తీర్పు ఇచ్చారు. 151 సీట్ల అఖండ విజయంతో తలెగరేసిన వైసీపీ ని 11 అసెంబ్లీ 4 పార్లమెంట్ సీట్లతో తలవంచేలా చేసారు ఏపీ ప్రజానీకం. ఈ స్థాయి ఫలితాలతో జగన్ ప్రభుత్వం మీద ప్రజలలో ఎంత వ్యతిరేకత ఉందో అర్ధమవుతుంది.

ఫలితాల తరువాత కూడా జగన్ తానూ ఈ ఐదేళ్లలో చేసిన తప్పులేంటో సమీక్ష చేసుకోకుండా ఇంకా బటన్లు నొక్కాను..నాకెందుకు ఓటేయ్యలేదు, అమ్మఒడి తీసుకున్న తల్లుల ఓట్లేటు పోయాయి, అసలు ఈవీఎంలు సరిగా పని చేశాయా.? అంటూ అటు ప్రజలను ఇటు వ్యవస్థలను నిందిస్తున్నారు.

Also Read – భయపడ్డారా.? భయపెడుతున్నారా.?

నొక్కిన బటన్ లను గుర్తుపెట్టుకున్న జగన్ పెంచిన పన్నులను విస్మరించారా.? ఒక చేత్తో అమ్మ ఒడి వేసి మరో చేత్తో నాన్న బుడ్డితో లాక్కున్నది జగన్ మరిచారా.? ఏడాదికి 250 చప్పున్న పెంచుకుంటూ పోయిన అవ్వాతాతయ్యల పెన్షన్ కోసం ప్రతి ఇంటి నుండి నెలకు 500 వందల నుంచి 1000 కి పెంచిన కరెంట్ బిల్లుల మోత జగన్ తెలుసుకోలేకపోయారా.?

వైసీపీ ప్రభుత్వం వేసిన చెత్త పన్ను అధికారులు జగన్ కు చెప్పలేదా.? పెరిగిన నిత్యావసరాల ధరలు తగ్గిన ఆదాయం, ఉపాధి లేక వలస బాట పట్టిన భవన నిర్మాణ కార్మికుల ఆకలి కేకలు తాడేపల్లి ప్యాలస్ గేటు తాకలేదా.? కల్తీ మద్యం తో ప్రాణాలు కోల్పోతున్న మందుబాబుల కుటుంబాల కన్నీటి తడి జగన్ చూడలేకపోయారా.? జగన్ పాలనలో పంట సాయం అందక ప్రాణాలు విడిచిన రైతన్నల కన్నీళ్లు ఏ బటన్ నొక్కి ఆపారు.?

Also Read – విశాఖకు మెట్రో… భారం అవుతుందేమో?

రాష్ట్ర రాజధాని కోసం 33 వేల ఎకరాల సొంత భూమిని త్యాగం చేసిన రైతు కుటుంబాలను గడిచిన ఐదేళ్లుగా కంటికి నిద్ర లేకుండా, నోటికి తిండి లేకుండా రోడ్డున పడేసిందెవరు.? ఉన్న భూమిని కోల్పోయి ఉపాధి లేక, ఆదాయం రాక పిల్ల భవిష్యత్తు ఏమిటో అర్ధం కాకా, ప్రభుత్వ వేధింపులు తట్టుకుంటూ వారు పెట్టిన శాపాలు ఎన్ని బటన్లు నొక్కితే పోతాయి.? నాకు వయస్సు ఉంది మరోసారి పాదయాత్ర చేస్తా మళ్ళీ అధికారాన్ని అందిపుచ్చుకుంటా అంటూ జగన్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే జగన్ ఇంకా తన సలహాదారుల సలహాలే వింటున్నారా.? అనే సందేహం కలుగుతుంది.

పాదయాత్రలు చేస్తే అధికారం వస్తుంది అనే పిచ్చి భ్రమలో జగన్ ఉన్నారంటే ఆయన ఎప్పటికి ప్రజల అభిప్రాయాన్ని ఎప్పటికి అర్ధం చేసుకోలేరని తెలుస్తుంది. అధికారం ఇచ్చింది బూతులు తిట్టడానికే, ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టులు చేయడానికే, తమను అడ్డుకుంటే ఓటర్ నైనా చెంప పగలకొడతాం అంటూ రెచ్చిపోయిన చేతి వాటం నాయకులను, నోటి దూల మంత్రులను వెనకేసుకొచ్చిన పాపానికి బాధ్యత ఎవరిదీ.?

Also Read – ఇంతకీ ఆ కేసులో కేసీఆర్‌ ఓడారా… గెలిచారా?

కనీసం మహిళలనే గౌరవము కానీ చిన్న పిల్లలు అనే సృహ కానీ లేకుండా చేసిన పిచ్చి ప్రేలాపనలకు ఫలితం ఎవరు అనుభవిస్తారు.? దేవాలయాలను కూల్చి, కులాల మధ్య ఘర్షణలు, మతాల మధ్య మంటలు సృష్టించి ఇదే మా రాజకీయం అంటూ ముందుకెళ్లిన జగన్ కు ఇది రాజకీయం కాదు రాజరికం ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం అంటూ వైసీపీ రేకలు విరిచారు ఓటర్లు.

అయితే ఓటమి తాలూకా సమీక్ష అంటే ఈ ఐదేళ్లలో జరిగిన పొరపాట్లను, తప్పిదాలను గుర్తించి వాటిని మరల పునరుద్ధరించకుండా ప్రజలు మధ్యకు రావడం. కానీ జగన్ మాత్రం గత ఐదేళ్లు ప్రతిపక్షాలు కళ్ళుమూసుకున్నాయి,ఈ ఐదేళ్లు మనం కళ్ళు మూసుకుందాం, మళ్ళీ మన ఛాన్స్ వస్తుంది, తిరిగి ఇదే బటన్ నొక్కే కార్యక్రమాలతో మళ్ళీ రాజకీయం మొదలుపెడదాం అంటూ ఇంకా రాష్ట్ర ప్రజలు ప్రభుత్వాలు నుండి ఎం ఆశిస్తారో కళ్ళు తెరిచి చూడలేకపోతున్నారు.

అప్పులతో సంక్షేమం కాదు అభివృద్ధితో సంక్షేమం అనేది ప్రజల ఆశ. ముఖ్యమంత్రి అంటే పరదాల మధ్య కాదు ప్రజల మధ్య ఉండాలి అనేది జగన్ ఇప్పటికి గ్రహించ లేకపోతున్నారు. జగన్ దృష్టిలో ప్రతిపక్షంలో ఉంటేనే రాజకీయ పార్టీలకు ఆ పార్టీ నాయకులకు పాదయాత్రల పేరుతో ప్రజలతో అవసరం పడుతుంది. అదే అధికారం అందగానే ఆ ప్రజల మధ్యకు రావడానికి పరదాలు, పోలీసులు కావాలి.

అలాగే కూటమి ప్రభుత్వం ఇంకా కొలువు తీరక ముందే శిశుపాలుడి పాపాలు లెక్కించినట్టుగా టీడీపీ చేస్తున్న అవమానాలను, దాడులను లెక్కిద్దాం అంటూ అప్పుడే రెచ్చకొట్టే వ్యాఖ్యలు మొదలుపెట్టారు జగన్. అసలు ఆ శిశుపాలుడి పాపాల చిట్టా పొద్దుకంటే ఎక్కువ పాపాలు వైసీపీ ప్రభుత్వంలో జరిగినాయి.

కాబట్టే ప్రజలు సమయం చూసి దెబ్బ కొట్టారు అనేది జగన్ తెలుసుకునే లోపు ఆయన దగ్గరున్న ఆ 11 మంది ఎమ్మెల్యే లు, 4 గురు ఎంపీ కూడా చేజారిపోవడం కాయం. ఇక ఆ తరువాత ఆయన ఎవరి సలహాలు తీసుకోవాల్సిన అవసరం ఉండదు అలాగే ఎవరికీ తానూ సలహాలిచ్చే స్థాయిలోను జగన్ ఉండరు.