ప్రజలని నమ్మించడానికి రాజకీయ నాయకులు అనేక మాటలు చెపుతుంటారు. హామీలు ఇస్తుంటారు. అవసరమైతే శంకుస్థాపనలు కూడా చేస్తుంటారు. కానీ ఆచరణలో జరిగేవి కొన్నే. ఓ వైపు దశాబ్ధాలుగా నిక్షేపంగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ని కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెడితే, రాష్ట్ర ప్రభుత్వం దానిని కాపాడుకొంటే సరిపోయేది. కానీ నడుస్తున్న స్టీల్ ప్లాంట్‌ని పట్టించుకోకుండా కడపలో కొత్త స్టీల్ ప్లాంట్ నిర్మించడానికి శంకుస్థాపన చేయడాన్ని… మూడేళ్ళయినా ఒక ఇటుక కూడా పెట్టని ఆ ప్లాంట్ కోసం గనులు కేటాయించాలని సిఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీకి విజ్ఞప్తి చేయడాన్ని ఏమనుకోవాలి?
సిఎం జగన్ శుక్రవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రూ.500 కోట్లు వ్యయం అయ్యే ఓ మెడికల్ కాలేజీకి, మరో రూ.470 కోట్లు వ్యయం అయ్యే తాండవ-ఏలేరు ఎత్తిపోతల పధకంలో భాగంగా కాలువల అనుసంధాన ప్రాజెక్టు పనులకి, రూ.16 కోట్లు వ్యయం అయ్యే నర్సీపట్నం రోడ్డు విస్తరణ పనులకి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సిఎం జగన్ మాట్లాడుతూ, “గత ప్రభుత్వం ఏనాడూ నర్సీపట్నం అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. కానీ మా ప్రభుత్వం ఏకంగా రూ.986 కోట్లతో అభివృద్ధిపనులు చేపడుతోంది. వీటితో నర్సీపట్నం రూపురేఖలే మారిపోతాయి. మేము ఎప్పుడూ చేసేదే చెపుతాము. చెప్పింది తప్పకుండా చేస్తాం. మా నాయకుడు జగన్ ముఖ్యమంత్రిగా అద్భుతంగా పాలిస్తున్నాడని రాష్ట్రంలో ప్రతీ ఒక్కరూ గర్వంగా చెప్పుకొనేలా చేస్తాము. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వారి మీడియా అనే ఓ చెడిపోయిన వ్యవస్థతో మనం పోరాడుతూనే ముందుకు సాగాల్సి వస్తోంది,” అని అన్నారు.
కానీ జగన్‌కి హటాత్తుగా నర్సీపట్నం మీద ఎందుకు ఫ్రేమ పుట్టుకొచ్చింది అంటే దానికి బలమైన కారణమే ఉంది. వచ్చే ఎన్నికలలో టిడిపిలో ముఖ్యనేతలని వారి నియోజకవర్గాలలోనే దెబ్బ తీయాలనే వ్యూహంలో భాగంగానే సీనియర్ టిడిపి నేత చింతకాయల అయ్యన్నపాత్రుడికి కంచుకోట నర్సీపట్నంని జగన్ ఎంచుకొన్నట్లు చెప్పవచ్చు.
మంచిదే! తనని ఓడించేందుకు వైసీపీ ప్రభుత్వం రూ. 986 కోట్లతో నర్సీపట్నం అభివృద్ధి చేస్తుందంటే ఆయన కూడా చాలా సంతోషిస్తారు. కానీ ఇప్పటికే వైసీపీకి మూడున్నరేళ్ళ పుణ్యకాలం ముగిసిపోయింది. మరో ఆరేడు నెలల్లో ఎన్నికల హడావుడి మొదలైపోతుంది. కనుక ఇప్పుడు శంకుస్థాపన చేసిన పనులు ఆలోగా మొదలయ్యే అవకాశమే ఉండదు. ఒకవేళ మొదలుపెట్టినా రాష్ట్ర ప్రభుత్వం డబ్బుకి కటకటలాడుతోంది కనుక వచ్చే ఎనికలలోగా వాటిని పూర్తి చేయలేదు. కనుక ఈ పేరుతో కాస్త హడావుడి చేస్తూ నర్సీపట్నం ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొనేందుకే ఈ శంకుస్థాపనలని భావించవచ్చు.



