YS Jagan

ఇదివరకు వైసీపి అధికారంలో ఉన్నప్పుడు, ‘చంద్రబాబు నాయుడు, పవన్‌ కళ్యాణ్‌, నారా లోకేష్‌ ముగ్గురూ హైదరాబాద్‌లో ఉంటూ పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తున్నారని, ఎన్నికలలో ఓడిపోతే ముగ్గురూ మళ్ళీ హైదరాబాద్‌ వెళ్ళిపోతారని, అటువంటి వాళ్ళని చూసి టిడిపి, జనసేనలకు ఓట్లు వేయడం మంచిది కాదని జగన్‌ ప్రజలకు హితభోధ చేస్తుండేవారు. కానీ ఇప్పుడు జగన్‌ అదే చేస్తున్నారు.

Also Read – హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?

బెంగళూరు ప్యాలస్‌లో సేద తీరుతూ, సిఎం చంద్రబాబు నాయుడు, టిడిపి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ లేఖలు వ్రాస్తున్నారు. నిజానికి ఆయన తెలుగులో మాట్లాడటానికే తడబడుతుంటారు అటువంటిది రెండేసి పేజీలు తెలుగులో వ్రాయగలరా? తెలుగులో టైప్ చేయగలరా? అంటే కాదనే అర్దమవుతుంది.

వైసీపి సోషల్ మీడియా ఆయన పేరిట ఇటువంటి ప్రేమ లేఖలు తయారుచేసి పోస్ట్ చేస్తుందని వేరే చెప్పక్కర లేదు. కానీ జగన్‌ పేరుతో ప్రేమలేఖ వస్తే టిడిపి స్పందించకుండా ఉంటుందా? ఉండదు.

Also Read – వీళ్ళు పాక్ మంత్రులా.. ఉగ్రవాదులా?

ప్రభుత్వ పాఠశాలలో ఈసారి సీబిఎస్ఈ సిలబస్ బదులు రాష్ట్ర సిలబస్‌తో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దానినే తప్పు పడుతూ జగన్‌ పేరుతో సోషల్ మీడియాలో ఓ పెద్ద ప్రేమలేఖని పోస్ట్ చేశారు.

దానికి టిడిపి అంతకంటే ఘాటుగా జవాబు ఇచ్చింది. బెంగళూరు నుంచి ట్వీట్‌ వేసిన పులివెందుల ఎమ్మెల్యేగారికి… అంటూ “మా ప్రభుత్వం సీబిఎస్ఈ రద్దు చేసిన్నట్లు రాత్రి ఏమైనా కల వచ్చిందా? విద్యార్ధులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకే మా ప్రభుత్వం ఈ ఏడు సిబిఎస్ఈ పరీక్షలు కాకుండా, స్టేట్ బోర్డుకి పరీక్షలు రాసే వెసులుబాటు ఇచ్చింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి, ఒక ప్రణాళిక ప్రకారం సిబిఎస్ఈ అమలు చేస్తుంది మా ప్రభుత్వం,” అంటూ ఘాటుగా జవాబిచ్చింది.

Also Read – ముందు టెట్ తర్వాత డీఎస్సీ నిర్వహించండి మహాప్రభో!

రాష్ట్ర సిలబస్‌ ప్రాధాన్యత జగన్‌ గ్రహించకపోవడం వలన లేదా విద్యార్దులపై ఇంగ్లీషు మీడియం బలవంతంగా రుద్దాలని హడావుడిగా సీబిఎస్ఈ సిలబస్ ప్రవేశపెట్టారు తప్ప ఆ సిలబస్ బోధించేందుకు ఉపాధ్యాయులు, విద్యార్దులు, మన విద్యావ్యవస్థ సిద్దంగా ఉన్నాయా లేవా? అని పట్టించుకోలేదు. అసలు మాతృభాష తెలుగుని వద్దనుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అని చెప్పక తప్పదు.

విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణని నియమించడంతోనే జగన్‌ విద్యావ్యవస్థతో ప్రయోగాలు మొదలుపెట్టి ఆ వ్యవస్థని చాలా దెబ్బ తీశారు. ఆ ఐదేళ్ళలో చదువుకున్న విద్యార్దులు తీవ్రంగా నష్టపోయారు. ఇలాంటి ప్రయోగాలు వద్దని ఉపాధ్యాయులు, అధికారులు మొత్తుకున్నా జగన్‌ వినలేదు.

జగన్‌ చేసిన తప్పులని సరిదిద్దమే టిడిపి కూటమి ప్రభుత్వానికి ఓ పెద్ద పనిగా మారిందిప్పుడు. వాటిలో ఒకటైన విద్యావ్యవస్థని ఇప్పుడు గాడిన పెడుతుంటే, బెంగళూరు ప్యాలస్‌లో కూర్చొని ఇలా విమర్శలు గుప్పిస్తున్నారు.




జగన్‌కి తాను చేసిన తప్పులు, రాష్ట్రానికి కలిగించిన నష్టం తెలియకపోతే సహించవచ్చు. కానీ చేసిన తప్పులను టిడిపి కూటమి ప్రభుత్వం సరిచేస్తుంటే కనీసం వాటిని చూసైనా తప్పు గ్రహించకపోవడం, పైగా ఈవిదంగా ప్రభుత్వాన్ని తప్పు పట్టడం ఇంకా పెద్ద తప్పు. అసలు 175 సీట్లు అనుకుంటే ప్రజలు 11 సీట్లే ఎందుకు ఇచ్చారనే ఆలోచన కూడా జగన్‌కి కలగలేదని అర్దమవుతోంది.