ఆటలో ఓడిపోయిన తర్వాత కూడా గెలిచే ప్రయత్నం చేసేవారిని లేదా మేమే గెలిచామని సగర్వంగా చెప్పుకునేవారిని ఏమనాలి?అంటే జగన్ అని అనాలి.
శాసనసభ ఎన్నికలలో 175కి బదులు కేవలం 11 సీట్లు మాత్రమే వచ్చినప్పుడు జగన్ అలాగే మాట్లాడారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయి రాజకీయంగా ఎదురుదెబ్బ తిన్నప్పుడు అదే విదంగా మాట్లాడుతున్నారు.
జగన్ తిరుమల పర్యటనకి వస్తే భక్తుల ముసుగులో గూండాలు ఆయనపై దాడి చేసే ప్రమాదం ఉందని గ్రహించడం వలననే పర్యటన రద్దు చేసుకున్నారని ఆత్మసాక్షి చెప్పింది. కానీ ఈ టాపిక్ డైవర్ట్ కాకూడదనే తాను తిరుమల పర్యటన రద్దు చేసుకున్నానని జగన్ చెప్పుకొచ్చారు.
టీటీడీ మాజీ ఛైర్మన్‌గా పనిచేసిన భూమన కరుణాకర్ రెడ్డి జగన్ తిరుమలకి వస్తే డిక్లరేషన్ ఇవ్వబోరని, ఆ సాంప్రదాయాన్ని గౌరవించబోమని తెగేసి చెప్పారు.
కానీ తిరుమల శ్రీవారి పట్ల తమ కుటుంబానికి ఎనలేని భక్తి ఉందంటూ జగన్ హిస్టరీ తిరగేసి గతంలో తన తండ్రి, తాను ఎన్నిసార్లు తిరుమలకి వచ్చామో, ఎన్నిసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించామో లెక్కలు చెప్పి, ఫోటోలు చూపారు. అయితే ఆ ఫోటోలలో ఎక్కడా విజయమ్మ, భారతి వారి పక్కన ఎందుకు లేరనే ప్రస్థావన జగన్ చేయలేదు.
తనకు స్వామివారిపై భక్తి, నమ్మకం ఉన్నాయని డిక్లరేషన్ ఇవ్వడానికి ఇష్టపడని జగన్, తనకు స్వామివారిపై భక్తి ఉందని నోటితో చెప్పుతున్నారు. ఫోటోలు చూపి నమ్మమంటున్నారు.
తన 5 ఏళ్ళ పాలనలో కనిపించనిదే మానవత్వం అనే సంగతి మరిచిన్నట్లు ‘నా మతం మానవత్వం’ అని జగన్ పంచ్ డైలాగ్ పేల్చారు.
“నన్ను చీకటి గదిలో బందించి చేతులు కాళ్ళు కట్టేసి విచారణ పేరుతో చిత్రహింసలు పెట్టిస్తూ ఆ వీడియోని చూసి ఆనందించినప్పుడు నీ మానవత్వం ఎక్కడుంది జగన్?” అని రఘురామ కృష్ణరాజు అడుగుతున్నారు.
నేతి బీరకాయలో నెయ్యి ఉండక పోవచ్చు కానీ జగన్ ప్రసంగంలోనే టన్నుల కొద్దీ నెయ్యి కారింది. ఆ నేతి లెక్కలతో జనాలని అయోమయపరిచి లేదా విసుగెత్తేలా చేసి జగన్ తన పాపాలను ఆ కల్తీ నేతితోనే కడిగేసుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
‘మా తాతలు నేతులు తాగారు మా మీసాల వాసన చూడండి’ అన్నట్లున్నాయి జగన్ మాటలు. కానీ కల్తీ నెయ్యి వాసన కూడా ఎన్నటికీ జగన్ వదిలించుకోలేరని గ్రహిస్తే మంచిది.
అయినా అక్రమాస్తుల కేసులు, వివేకా హత్యకేసులలో సీబీఐ, హైకోర్టు, సుప్రీంకోర్టులనే ముప్పతిప్పలు పెడుతున్న జగన్‌కి ఈ వ్యవహారంలో ప్రజలను, పాలకులను పక్కదారి పట్టించడం పెద్ద కష్టం కాదని నిన్న మరోసారి నిరూపించి చూపారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తుంటే, తిరుమల పర్యటన పేరుతో ఆడిన చిన్న డ్రామాతో అందరి దృష్టిని దానిపై నుంచి అలవోకగా మళ్ళించగలిగారు.
తాను డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ చంద్రబాబు నాయుడే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని పూర్తి నమ్మకంతో చెపుతున్నారు.
క్లీన్ బౌల్డ్ అయిన తర్వాత కూడా రన్స్ తీయడం కేవలం…కేవలం… జగన్‌కి మాత్రమే సాధ్యం! కనుక ఇప్పటికైనా టిడిపి, జనసేన, బీజేపీలు జగన్‌ని తక్కువ అంచనా వేయడం మానుకొని బౌలింగ్, ఫీల్డింగ్ ఎలా చేయాలో నేర్చుకుంటే మంచిది.




