విజయవాడ వరదలతో అల్లాడుతుంటే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే వైస్ జగన్ బాధితులను పరామర్శించడానికి వచ్చారు, ప్రభుత్వాన్ని విమర్శించి వెళ్లారు, ఆ తరువాత మాయైపోయారు.
నిన్న తన తండ్రి వైస్ రాజశేఖర్ రెడ్డి వర్థంతి సందర్భంగా హుటాహుటిన బెంగళూర్ ప్యాలస్ నుంచి ఇడుపులపాయ వైస్సార్ ఘాట్ ను సందర్శించి తండ్రికి నివాళ్ళు అర్పించి, పనిలో పనిగా వరద బాధితుల దగ్గరకు కూడా ఒక రౌండ్ వేశారు జగన్.
తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రాష్ట్రంలో తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా ఏదైనా సంఘటన జరిగినా దానికి పూర్తి బాధ్యత బాబుదే అంటూ నెపం మొత్తం బాబు మీద నెట్టి చేతులు దులుపుకునే వారు జగన్. అలాంటిది ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షంలో ఉంది, వ్యవస్థలు జగన్ చేతిలో లేవు. ఇక ఇలాంటప్పుడు జగన్ బాబుని టార్గెట్ చెయ్యకుండా ఉంటారా?
ప్రకృతి సృష్టించిన విపత్తుని ఇది మానవ తప్పిదమని, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్లక్ష్యం వలన ఏర్పడిన జల విలయమిది అంటూ జగన్ తన చేతిలో పెట్టిన స్క్రిప్ట్ కి న్యాయం చేసి వెళ్లిపోయారు. విపత్తును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని, ఇందుకు బాధ్యతగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి 2 గంటలు హడావుడి చేసిన జగన్ ఆ తరువాత తాడేపల్లి ప్యాలస్ కు చేరుకున్నారు.
అయితే ఇక ఆ తరువాత జగన్ ఏమైపోయారో, వైసీపీ నేతలు ఎటు వెళ్లిపోయారో పత్తా లేదు. ఇటువంటి విపత్తులో సైతం కూటమి ప్రభుత్వం మీద రాజకీయ విమర్శలు చేయగలిగిన జగన్ కాసేపు రాజకీయాలను పక్కన పెట్టి మానవత్వం కోసం నిలబడదాం అనుకుంటే జగన్ కావాలని కోర్టుకెళ్లిన హోదా కంటే ప్రజలలో ఇంకా ఉన్నత హోదా దక్కి ఉండేది.
ఒకపక్క గుక్కిడు నీళ్ల కోసం, పట్టెడన్నం కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టి పోరాడుతున్న బాధితుల దగ్గరకు వెళ్లి పరామర్శల పేరుతో జై జగన్, సీఎం..సీఎం అంటూ నినాదాలు చేపించుకుంటూ తనకలవాటైన షిక్కటి చిరు నవ్వులు నవ్వుకుంటూ జగన్ చేసిన ఓదార్పు కు అర్ధం మేమిటి?
పరామర్శకు వెళ్ళినప్పుడు తనతో పాటు ఆ బాధిత కుటుంబాలకు అవసరమైన నిత్యావసర వస్తువులనో, ఆహార పొట్లాలనో తనతో పాటు తీసుకెళ్లి ఆ కుటుంబాలకు అండగా నిలబడి ఆ తరువాత ప్రభుత్వం మీద విమర్శలు చేసినా జగన్ మీద ఈ స్థాయి వ్యతిరేకత రాకపోయి ఉండేది. అలా కాకుండా వచ్చి తిట్టొ పో అన్నట్టుగా మెరుపు తీగమాదిరి జగన్ ఇలా వచ్చి అలా మాయమైపోయారు.
బాబు ఇల్లు కాపాడుకునేందుకే వరద సృష్టించారని కాసేపు, బుడమేరు గేట్లు వలనే వరద ఉదృతి పెరిగిందంటూ కాసేపు, బాబు నిర్లక్ష్యం ఫలితమే విజయవాడకు ఈ విపత్తు, రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చెయ్యడం వల్లనే వరద తీవ్రత తగ్గిందని కాసేపు ఇలా పొంతన లేని ఆరోపణలతో ప్రభుత్వం పై జగన్ చేసిన విమర్శలు తిరిగీ తిరిగి వైసీపీ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.
విమానాలలో ఏరియల్ సర్వేలు చేసిన చరిత్ర వెనకేసుకున్న జగన్ కు ఫీల్డ్ లో గ్రౌండ్ వర్క్ చేస్తున్న బాబు కష్టం ఎప్పటికి అర్ధం కాదు. అలాగే గత ఐదేళ్లు ప్యాలస్ పాలన చేసిన వైసీపీకి కూటమి ప్రభుత్వం విలువ తెలియదు.




