ఏపీ రాజకీయాలలో ఓ విచిత్రమైన పరిస్థితి నెలకొంది. చేయాలన్న సంకల్పం ఉన్నా… తగినన్ని ఆర్ధిక వనరులు లేక ప్రజలను ఎంతో కొంత అసంతృప్తికి గురి చేస్తోన్న చంద్రబాబు ప్రభుత్వం ఓ పక్కనైతే… సర్కార్ ఉన్న లోటుపాట్లను ఎత్తిచూపి ప్రజలకు భరోసా కల్పించలేక విఫలమవుతున్న ప్రతిపక్ష నేత జగన్ మరో పక్కన ఉండగా… తనకు ఎవరితోనూ స్నేహం, విభేదం లేదంటూ ప్రజాసంక్షేమమే ప్రధాన లక్ష్యం అంటూ సోషల్ మీడియా రాజకీయాలు చేసే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకొక దిక్కున… ఇంత జరుగుతున్నా, ఏపీలో తమ పార్టీ బలోపేతం కావడమే ప్రధాన లక్ష్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ రాజకీయాలు చివరి దిక్కున..!
ఇలా నాలుగు దిక్కులు కలిసి ప్రజలను గందరగోళంలో నెట్టేస్తున్నాయి. అధికారంలో ఉన్న వారు ఎలాంటి పనులు చేసినా… ప్రజలకు అండగా నిలవాల్సిన రెండు పార్టీలు ప్రజలను పక్కన పెట్టడమే శోచనీయమైన విషయం. హైదరాబాద్ లో ఉంటున్న వైసీపీ అధినేత జగన్, ఏదైనా అనుకోని ప్రమాదాలు, ప్రకృతి విపత్తులు వచ్చినపుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు గుర్తుకు రావడం విశేషం. అపుడు కూడా… మీడియా కోసం ఓ ప్రెస్ మీట్, చంద్రబాబుపై నాలుగు విమర్శలు చేసి చేతులు దులిపేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. తన రాజకీయాలన్నీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అయిన సాక్షి ద్వారానే జగన్ సాగిస్తూ… పార్ట్ టైం రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారారన్న విమర్శలను మూటకట్టుకుంటున్నారు.
మరో వైపు ప్రజలకు అండగా ఉంటానని చెప్పిన ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలు చేసుకుంటూ, సోషల్ మీడియాలో భాగమైన ట్విట్టర్ ద్వారా తన భావాలను పంచుకుంటూ… పార్ట్ టైం పొలిటిషియన్ గా స్థిరపడ్డారు. ఎప్పుడెప్పుడు పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వస్తారా అని అభిమానులతో పాటు సామాన్య ప్రజలు ఎదురుచూస్తున్న తరుణంలో… తనకు ఆర్ధిక బలం లేదంటూ సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు పవన్. దీంతో ఏపీలో ప్రజల కోసం పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసే నాయకులు లేక కరువయ్యారు. అధికార పక్షం చేసేది చేస్తుంటుంది గానీ… ప్రతిపక్షం సరిగ్గా నిలదీసినపుడే సర్కార్ పై ఒత్తిడి పెరిగి అలెర్ట్ గా ఉంటారు. ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలకైతే ‘సున్నా’ మార్కులే పడతాయ్ మరి!



