దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసులుగా తెలుగు రాష్ట్ర రాజకీయాలలో అడుగు పెట్టిన వైస్ జగన్, వైస్ షర్మిల ఇద్దరు కూడా తమ తండ్రి రాజకీయ ఛరిష్మా తో ముందుకెళ్తున్నారు.
అయితే వైస్ జగన్ వైసీపీ రూపంలో ఏపీలో రాజకీయం మొదలుపెట్టగా అందుకు తనవంతు సాయంగా చెల్లి షర్మిల అన్న వదిలిన బాణంగా ఏపీ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.
అయితే బాణం లక్ష్యాన్ని ఛేదించగానే ఎలా అయితే నిరుపయోగం అవుతుందో అలానే జగన్ ముఖ్యమంత్రి లక్ష్యం నెరవేరగానే షర్మిల కూడా వైసీపీకి భారంగా, ఏపీ రాజకీయాలకు దూరంగా జరిగారు.
దీనితో టి. వైసీపీ అంటూ పుట్టింటి నుంచి అత్తంటి రాజకీయాలకు వెళ్లిన షర్మిల తిరిగి కాంగ్రెస్ రూపంలో పుట్టింటికి చేరింది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఒక చచ్చిపడున్న పాము మాదిరే ఉన్నప్పటికీ అందులో కూడా షర్మిల తనకు అవకాశాన్ని వెతుకుతున్నారు.
అందులో భాగంగానే తన కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ మీద కూడా షర్మిల తాజాగా స్పందించారు. వైఎస్ఆర్ రాజకీయ వారసుడిగా రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఉంటుందంటూ ప్రకటించారు షర్మిల. అయితే షర్మిల తన తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందుకుంటూ అందుకు కొనసాగింపుగా తన కొడుకు అరంగేట్రం ఉంటుందంటూ వైసీపీ కి సొంత పోరు తప్పదు అనేలా జగన్ కు హింట్ ఇచ్చారు.
షర్మిల రాజకీయంగా తన తరువాత స్తానం తన కొడుకుది అంటూ ఇప్పుడే ప్రకటించేసారు. అయితే మరి వైసీపీ లో జగన్ తరువాత ఎవరు.? అన్న ప్రశ్నకు వైసీపీ దగ్గర కానీ ఆ పార్టీ అధినేత వైస్ జగన్ దగ్గర గాని ఇప్పటికి సమాధానం లేదు.
రాజకీయాలలో ఎప్పుడు ఎం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. 2023 చివరాంకంలో ఎవరు ఊహించని విధంగా వైసీపీ చంద్రబాబు నాయుడు ని అరెస్టు చేసింది, సుమారు 60 రోజుల పాటు జైల్లో ఉంచింది. అలాగే గతంలో వైస్ జగన్ కూడా సుమారు 16 మాసాలు జైలు జీవితం గడిపి వచ్చినవారే.
అయితే ఆ ఆసమయంలో వైసీపీ కి జగన్ తరువాత “నేనున్నాను..నేను వింటాను..నేను వస్తాను” అంటూ వైస్ షర్మిల వైసీపీ భుజం కాసింది, పాదయాత్రతో వైస్ జగన్ కు కుడి భుజమయ్యింది. అలాగే బాబు అరెస్టు సమయంలో పార్టీ పూర్తి బాధ్యతలను ఆయన రాజకీయ వారసుడిగా లోకేష్ దగ్గరుండి నడిపించారు.
మరలాంటి సమస్యే వైసీపీ కి ఊహించని విపత్తులా ఎదురైతే జగన్ తరువాత ఆ పార్టీ బాధ్యతలు నెత్తెనేసుకోవడానికి గతంలో మాదిరి ఇప్పుడు వైసీపీ కి షర్మిల లేరు, ఇక అలాగే వైసీపీ ని ఇన్నాళ్లుగా తన రాజకీయ చాణిక్యంతో, మాట చాకచక్యంతో కాపు కాస్తూ వచ్చిన విజయ సాయి రెడ్డి కూడా వైసీపీ ని కాదని జగన్ వద్దనుకుని రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారు.
మరి నాటి షర్మిల స్థానాన్ని, నేటి సాయి రెడ్డి పాత్రను పోషించే ఆ వైసీపీ నేత ఎవరు.? జగన్ రాజకీయ వారసుడు ఎవరు.? ఇలా పార్టీలో నెక్స్ట్ ఎవరు అనే ఈ చిన్న ప్రశ్నే చాల పెద్ద పెద్ద సమస్యలకు పరిష్కారం గా నిలబడుతుంది.
నాడు వైసీపీ ని రాజకీయంగా నిలబెట్టిన షర్మిల నేడు అదే వైసీపీ ని పతనం దిశగా తీసుకెళ్లేందుకు ఉన్న అన్ని దారులను అన్వేషిస్తుంది, ఆ విధంగానే రాజకీయం చేస్తుంది. అందులో భాగంగానే వదల బొమ్మాలి నిన్ను వదలా అంటూ తన కొడుకు రాజారెడ్డి రూపంలో వైసీపీ ని చివరి వరకు వెంటాడడానికి షర్మిల సిద్ధమయ్యారు.
మరి చెల్లి ప్రకటించిన ఈ రాజకీయ యుద్దాన్ని కొనసాగించడానికి అన్న తరుపున అరంగేట్రం చెయ్యబోయే ఆ రాజకీయ వారసత్వం ఎక్కడ.? ఎవరు.?




