ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదేళ్ళు పాలించమని ప్రజలు వైసీపీకి అధికారం కట్టబెడితే ఎన్నికలకు ఇంకా రెండేళ్ళు ఉండగానే అప్పుడే ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టేసింది. ఆ ప్రయత్నంలోనే గడప గడపకు కార్యక్రమం, బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రుల బస్సు యాత్రలు, బీసీలకు రెండు రాజ్యసభ సీట్లు, కోనసీమకు డా.అంబేడ్కర్ పేరు పెట్టడం వంటివి చేసింది.
గడప గడపకు కార్యక్రమంలో ప్రజలకు సమాధానాలు చెప్పుకోలేక మంత్రులు, ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు బడుగుబలహీన వర్గాల ఓట్ల కోసం కోనసీమపై చేసిన ప్రయోగం కూడా వికటించింది. అమలాపురంలో జరిగిన ఘటనలు చూసిన ప్రజలు “ఆంధ్రప్రదేశ్‌లో ఏమి జరగాలని కోరుకొన్నాము…కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమలాపురం అల్లర్లు టిడిపి, జనసేనల కుట్రే అని, శాంతి భద్రతలను కాపాడటంలో తమ ప్రభుత్వం విఫలమవలేదని మంత్రులు, సజ్జల రామకృష్ణారెడ్డి గట్టిగా వాదిస్తున్నారు. అల్లర్లు జరిగిన రోజున అమలాపురంలో విధ్వంసం జరుగుతుంటే ప్రభుత్వం, పోలీసులు ఏమీ చేయలేకపోయారు. కానీ మర్నాటికల్లా పరిస్థితులు పూర్తిగా అదుపులోకి వచ్చేయని వారే చెప్పుకోవడం అందరూ వింటూనే ఉన్నారు. అంటే ప్రభుత్వం, పోలీసులు తలుచుకొంటే మొన్న అమలాపురంలో అల్లర్లు జరుగకుండా అడ్డుకోగలిగి ఉండేవారని అర్దమవుతోంది. కానీ సంయమనం పేరుతో అలసత్వం ప్రదర్శించినట్లు భావించవచ్చు.
అందుకే ప్రతిపక్షాలు కూడా వైసీపీ నేతలే ఓ పధకం ప్రకారం ఈ అల్లర్లు జరిగేలా చేసిందని ఆరోపిస్తున్నాయి. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబును వెనకేసుకు వచ్చినందుకు ప్రజలు తమ ప్రభుత్వంపై, పార్టీపై ఆగ్రహంగా ఉన్నారని గ్రహించి వైసీపీ ఇటువంటి నీచమైన పనికి పూనుకొందని టిడిపి, జనసేనలు ఆరోపిస్తున్నాయి.
వైసీపీ-టిడిపి, జనసేనల మద్య ఈ పరస్పర విమర్శలను, ఆరోపణలను పక్కన పెట్టి చూస్తే, వచ్చే ఎన్నికల కోసం వైసీపీ ప్రదర్శించిన ఈ అత్యుత్సాహమే కోనసీమలో చిచ్చు రగిలించిందని అర్ధమవుతోంది. తాము ఒకటి ఆశిస్తే మరొకటి జరుగుతోందని ఇప్పటికైనా వైసీపీ నేతలు గ్రహించి ఈ ఎన్నికల హడావుడిని మరో ఏడాదిన్నర వరకు వాయిదా వేసి అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేసి, రాష్ట్రాభివృద్ధి చేసి చూపించగలిగితే ప్రజల మెప్పు పొందవచ్చు. ప్రజల ఆకాంక్షలు అర్ధం చేసుకోకుండా ఎన్నికలే లక్ష్యంగా ముందుకు సాగితే చివరికి నష్టపోయేది తామే అని గ్రహిస్తే మంచిది.



