వైసీపి అధినేత జగన్మోహన్ రెడ్డి ఈరోజు తాడేపల్లి ప్యాలస్‌లో జిల్లా పార్టీ అధ్యక్షులు, వైసీపి అనుబంధ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఈసారి జమిలి ఎన్నికలంటున్నారు… కనుక ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు అందరం సిద్దంగా ఉండాలి,” అని అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పదేళ్ళు ఎదురుచూసింది. ఏపీలో వైసీపి, టిడిపిలు చెరో 5 ఏళ్ళు ఎదురుచూశాయి. ఇప్పుడు వైసీపి మళ్ళీ ఎదురుచూస్తోంది. అంటే అధికారం దక్కడం ఎంత కష్టమో అర్దమవుతోంది.
అటువంటి గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చి అధికారం అప్పగిస్తే, దాని విలువ గుర్తించలేకపోయారు. రాష్ట్రాభివృద్ధి చేస్తున్న చంద్రబాబు నాయుడుని వద్దనుకొని ప్రజలు తనకు ఎందుకు అవకాశం ఇచ్చారో, ముఖ్యమంత్రిని చేశారో జగన్ గ్రహించలేదు.
తన గొప్పదనం, రాజకీయ చతురత వలననే తనకు పదవి, అధికారం దక్కాయని అహంభావంతో జగన్ మిడిసిపడ్డారు. ఆ అహంభావంతోనే తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అన్నట్లు రాష్ట్రాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించేశారు. అందుకు ఆగ్రహించిన ప్రజలు వైసీపిని ఎన్నికలలో ఓడించారు.
వైసీపి ఓటమికి ఆ పార్టీ నేతల అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు కూడా కారణమే. కానీ వారు ఆవిదంగా రెచ్చిపోవడానికి కారణం తానే అని జగన్ గ్రహించలేదు. కనుకనే వైసీపి ఎమ్మెల్యేలను మార్చేసి వారి స్థానంలో వేరేవారికి టికెట్స్ ఇచ్చారు.
కానీ వైసీపి గెలుపు క్రెడిట్ తనదేనని భావించిన జగన్ పార్టీ ఓటమి బాధ్యతను మాత్రం తీసుకోకుండా అందరికీ సమానంగా పంచిపెట్టేసి, మిగిలినది ఈవీఎంల మీదకు నెట్టేసి చేతులు దులుపుకున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు దాని విలువ గుర్తించలేకపోయిన జగన్, అప్పుడే జమిలి ఎన్నికల గురించి మాట్లాడుతుండటం చాలా హాస్యస్పదంగా ఉంది.
టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇంకా ఆరు నెలల హనీమూన్ పీరియడ్ కూడా పూర్తవలేదు. ఈ నాలుగు నెలల్లో జగన్ తాడేపల్లి ప్యాలస్ గడప దాటి బయటకు రానేలేదు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్దంగా ఉండాలని వైసీపి నేతలకి చెపుతున్నారు.
ముందు జగన్ తన ప్యాలస్‌లో నుంచి బయట ప్రజల మద్యకు వచ్చి తన ప్రభుత్వం, పాలన గురించి ప్రజలు ఏమనుకున్నారో స్వయంగా తెలుసుకుంటే ఇటువంటి పగటి కలలు తగ్గుత్తాయి.






