
శ్రీరాముడు అంతటివాడు కూడా మొదట తెలియక పది తలల రావణాసురుడిని అంతమొందించేందుకు బాణాలు వేస్తూ తలలని చేదించేవాడు. కానీ ఒక తల నరికితే వెంటనే మరో తల మొలిచేది. అప్పుడు విభీషణుడు సూచన మేరకు గురిచూసి కడుపులో ఉన్న అమృతభాండంపై బాణం వేయగా రావణాసురుడు చనిపోయాడు.
Also Read – ఢిల్లీ బీజేపి ఊడ్చేస్తే తెలంగాణలో కళ్ళాపి తప్పదేమో?
ఇంతకీ ఈ రావణవధ ప్రస్తావన ఎందుకంటే, జగన్ ఓటమిపై మాజీ మంత్రి, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు చేసిన తాజా వ్యాఖ్యల వల్లనే.
ఆయన కూడా జగన్ బాధితులలో ఒకరు. ఇటీవల ఆయన నర్సీపట్నంలో తన అనుచరులు, శ్రేయోభిలాషులతో సమావేశమైనప్పుడు ఇదే అంశంపై చర్చ జరిగింది.
Also Read – అల్లు వారి ఇంట మెగా వివాదాలు…!
“వైసీపి ఓడిపోయింది కానీ చావలేదు. నేటికీ జగన్‌కు అపారమైన ధనం ఉంది. దాంతో ఎవరినైనా కొనేయగలరు. నేటికీ ఆయనకు కుల బలం ఉంది. దానిని ఆయన తెలివిగా వాడుకోగలరు. నేటికీ ఆయనకు ప్రజలలో సానుభూతి, మద్దతు ఉంది. వారిని కూడా జగన్ వాడుకుంటారు.
అలాగే పొరుగు రాష్ట్రం తెలంగాణలో ఆయనకు చాలామంది రాజకీయ మిత్రులున్నారు. ఆ పార్టీ కూడా ఓడిపోయిందే తప్ప చావలేదు. ప్రస్తుతం ఆ పార్టీ పరిస్థితి కూడా దయనీయంగానే ఉన్నప్పటికీ జగన్‌లాగే అన్ని విధాలా చాలా శక్తివంతమైన, పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగల తెలివైన అధినేత దానికి ఉన్నాడు.
Also Read – సిఎం కంటే మంత్రులకే మంచి ర్యాంక్స్… భళా!
బల్లి ప్రాణానికి ప్రమాదం ఏర్పడినప్పుడు ఏవిదంగా తన తోకని తెంచేసుకొని తప్పించుకుంటుందో అదేవిదంగా జగన్ కూడా ఏదో విధంగా బయటపడే ప్రయత్నం చేస్తారు.
ఆ ప్రయత్నంలోనే మళ్ళీ ప్రజల సానుభూతి సంపాదించుకునేందుకు జగన్ పాదయాత్రకి సిద్దం అవుతున్నారు. కానీ ఇప్పట్లో ఎన్నికలు లేకపోవడంతో ఆయన ప్రయత్నం ఫలించే అవకాశం లేదు.
ఏది ఏమైనప్పటికీ భవిష్యత్‌లో జగన్ వలన మళ్ళీ టిడిపికి ప్రమాదం ఏర్పడకూడదనుకుంటే ఈసారి చంద్రబాబు నాయుడు జగన్, వైసీపి పట్ల కటినంగా వ్యవహరించక తప్పదని అభిప్రాయం వ్యక్తం చేశారు.
శత్రు శేషం, రుణ శేషం ఉంచకూడదంటారు పెద్దలు. ఉంచితే ఏదో ఓ రోజు అవే కొంప ముంచేస్తాయి. జగన్ అధికారంలో ఉన్నప్పుడు తన శత్రువుల విషయంలో ఇదే ఫార్ములా ఫాలో అయ్యారు కానీ ఆయన వ్యూహాలు బెడిసికొట్టాయి.
రుణాల చెల్లింపులకు జగన్ బాధ్యత వహించాల్సిన అవసరం లేదు కనుక ఎడాపెడా అప్పులు చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేసి వెళ్ళిపోయారు.
కనుక చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు ఆ శత్రు శేషంతో పాటు, రుణ శేష భారం నుంచి కూడా విముక్తి పొందాల్సి ఉంది.