మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజలకు ఆదర్శంగా ఉంటారని లేదా ఉండాలనుకోవడం అత్యాశ కాదు. కానీ వారే అక్రమాలకు పాల్పడుతుంటే? ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ పరిస్థితి ఇదే. ఎన్నికల నియామావళి ఉల్లంఘించినందుకు ఆమెపై అనంతపురంలో ఓ కేసు నమోదైంది. బుదవారం జరిగిన ఆ కేసు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో ఆమెతో సహా ఏడుగురికి న్యాయస్థానం నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. రాజకీయాలలో ఉన్నవారికి ఇటువంటి కేసులు మామూలే కనుక దీనిని పెద్దగా పట్టించుకోనవసరం లేదు.
కానీ కళ్యాణదుర్గంలో 200 ఎకరాలు విస్తీర్ణం కలిగిన చెరువులో 100 ఎకరాలను కబ్జా చేసి మట్టితో పూడ్చేసి ఆమె ప్లాట్లు వేసి అమ్ముకోవడాన్ని ఎవరూ సమర్ధించలేరు. మంత్రిగారి భూకబ్జా గురించి కళ్యాణదుర్గం టిడిపి ఇన్‌ఛార్జ్ ఉమామహేశ్వరరావు అధికారులకు పిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఆయన జూలై 6వ తేదీన ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు.
కళ్యాణదుర్గం సర్వే నంబర్ 329లో వంద ఎకరాల సుబేదార్ భూమిని మంత్రి ఉషశ్రీ చరణ్ కబ్జా చేసి ప్లాట్లుగా వేసి అమ్ముకొంటున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి, అనంతపురం జిల్లా కలెక్టర్, ఆర్డీవోలను ఆయన ప్రతివాదులుగా పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు మంత్రి ఉషశ్రీ చరణ్‌తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీ చేసి మూడు వారాలలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
ఇక తిరుమలలో ఇదే మంత్రిగారు చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఈ ఏడాది ఆగస్ట్ 15వ తేదీన మంత్రి ఉషశ్రీ చరణ్ తన అనుచరులను వెంటపెట్టుకొని తిరుమలకు వచ్చారు. అప్పుడు సెలవు దినాలు కావడంతో భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉన్నందున టీటీడీ విఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. అయినప్పటికీ మంత్రి ఉషశ్రీ చరణ్ టీటీడీ అధికారులపై ఒత్తిడి చేసి 10 మంది అనుచరులకు సుప్రభాత టికెట్లు తీసుకోవడమే కాకుండా మరికొంత మంది అనుచరులకు బ్రేక్ దర్శనాలు కల్పించారు. భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయగా మంత్రి గన్‌మెన్‌లు వారిపై దౌర్జన్యం చేశారు.
ప్రజలకి ఆదర్శంగా మెలగాల్సిన మంత్రులు, ప్రజా ప్రతినిధులు ఈవిదంగా వ్యవహరిస్తుండటం, భూకబ్జాలకు పాల్పడటం, నాన్-బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌లు అందుకోవడాన్ని ఏవిదంగా సమర్ధించుకోగలరు?ఇటువంటి వారికి ప్రజలు మళ్ళీ ఎందుకు ఓట్లు వేయాలి?



