మళ్ళీ మనమే అధికారంలోకి…. అని అనుకుంటేనే ఒళ్ళు పులకరిస్తుంది. ఆ పులకరింతల కోసం పార్టీలో అందరి చేత కూడా పదేపదే అనిపిస్తూనే ఉన్నాము. మరి వారికి ఆ పులరింత కలుగుతోందో లేదో తెలీదు కానీ కలిగినట్లే నటిస్తున్నారు.
కానీ వీసమంత కృతజ్ఞత లేని ఈ జనాలు మాత్రం ఈ పులకరింతలకు అతీతులమన్నట్లు నిర్లిప్తంగా చూస్తుంటే మా మనసులు చివుక్కుమంటున్నాయి.
అప్పటికీ పరామర్శ యాత్రలతో మనం బలం ఏమిటో ఈ జనాలకు చూపిస్తూనే ఉన్నాము. కోటి సంతకాలనో మరొకటనో హడావుడి చేస్తూ మళ్ళీ మనమే వస్తామని నమ్మకం కలిగించేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు.
కానీ ఈ బాబు దూకుడు చూస్తుంటే ఏదీ పడనిచ్చేలా లేడు. ఓ పక్క అమరావతి, మరోపక్క పోలవరం కట్టేస్తున్నాడు. మనం ఐదేళ్ళలో ఏం కట్టామని వెనక్కి తిరిగి చూస్తే రుషికొండ ప్యాలస్ ఒక్కటే కనపడుతోంది. కానీ ఈ ముసలాయన ఇన్నేసి ఎలా కట్టేస్తున్నాడో అర్ధమే కావడం లేదు.
ఐదేళ్ళుగా మనం చేసిన నిర్వాకానికి ఈ బాబు తలక్రిందులుగా తపస్సు చేసినా నాలుగు చిన్న చితకా కంపెనీలు తేగలిగితే అదే గొప్ప అనుకుంటే ఏకంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, టిసీఎస్‌లను పట్టుకొచ్చేస్తున్నాడు.
మనమేదో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ అంటూ హడావుడి చేసి రాష్ట్రానికి 13-14 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చేస్తున్నాయని నమ్మించేందుకు ఎంత ప్రయత్నించినా ఈ జనాలు నమ్మలేదు.
కానీ అంతేసి కంపెనీలు ఈ పెద్దబాబు, చిన్నబాబు మాటలు ఎలా నమ్మేసి వేలు.. లక్షల కోట్లు పెట్టుబడులతో విశాఖకు ఎలా వచ్చేస్తున్నాయో అర్ధమే కావడం లేదు.
సరే… పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు వచ్చినప్పటి సంగతి కదా? అప్పుడే చూసుకోవచ్చు… అవన్నీ గతంలో మనం కోడిగుడ్లతో చేసిన ప్రయత్నాల వల్లనే వచ్చాయని ఒకటికి పదిసార్లు సోషల్ మీడియాలో చెప్పుకొని జనాలను నమ్మించేయవచ్చు.
కానీ ఈ బాబున్నాడే… మన సంక్షేమ పధకాలను కూడా హైజాక్ చేసేస్తున్నాడు. మనం ఒకటిస్తే ఆయన పదిచ్చేస్తున్నాడు.
ఒకటో తారీకు తెల్లారేసరికి మనం షిక్కటి షిర్నవ్వులు నవ్వగల వాలంటీర్లను ఇళ్ళకు పంపిస్తే, ఈ ముసలాయనే హుషారుగా జనం దగ్గరకు బయలుదేరిపోతున్నాడు.
ముఖ్యమంత్రినని మరిచిపోయినట్లు పొలం గట్ల మీద, ఆటోలు, సిటీ బస్సులలో ఎక్కడ పడితే అక్కడే జనాలతో ఈ బాతాఖానీలు ఏమిటి?
మొన్న పొలం గట్టు మీద, సిటీ బస్సులో కనపడిన ఈ ముసలాయన, నిన్న ఢిల్లీలో కేంద్రమంత్రులు, గూగుల్ కంపెనీ సీఈవో పక్కన ఎలా ప్రత్యక్షమయ్యాడు?
నాడు ఒకే సమయంలో వేలమంది గోపికలను శ్రీకృష్ణుడు అలరించినట్లు, ఎక్కడ చూసినా ఈ బాబే కనపడుతున్నాడు. గల్లీలో బాబే… డిల్లీలో బాబే… ఆటోలో బాబే… బస్సులో బాబే… స్కూల్లో బాబే… పొలం గట్ల మీద బాబే!
జనాలు సరే…. అన్నీ తెలిసిన ఈ సీఈవోలు కూడా ఈ ముసలాయన మాటలు నమ్మేసి ఆయన బుట్టలో ఎలా పడిపోతున్నారో అర్ధం కావడం లేదు. బహుశః ఆయనకి వశీకరణ మంత్రమేదో తెలిసే ఉంటుంది. లేకుంటే అంతమంది టపాటపా ఎలా పడతారు?అసాధ్యం!
చుట్టూ ఇంతమందిని పెట్టుకున్నా ఒక్కడికీ ఆ మంత్రం అబ్బలేదు… డామిట్! ఆ మంత్రం లేకుండా ‘మళ్ళీ మనమే’ అని ఈ జనాలను ఎలా నమ్మించగలం? ఏదో ఒకటి చేయక తప్పదు. ఏం చేయాలి… ఏం చేయాలి?






