ఎన్టీఆర్… పరిచయమే అవసరం లేని పేరు. మొదట సినీ రంగంలో ఆ తరువాత రాజకీయాలలో ప్రవేశించి ప్రజలను మెప్పించి వారి హృదయాలలో శాస్వితంగా నిలిచిపోయారు సర్గీయ నందమూరి తారక రామారావు.
కొందరు ఆయనను సాక్షాత్ శ్రీకృష్ణుడిగా…కోదండరాముడిగా భావిస్తే, బడుగుబలహీన వర్గాల ప్రజలు సమాజంలో తమకు ఓ గుర్తింపు, గౌరవం, సముచిత స్థానం కల్పించినందుకుగాను ఆయనను ఓ అన్నగా ఆరాధిస్తుంటారు. ఈవిదంగా ఎవరు ఏరూపంలో కోరుకొంటే ఆవిదంగా కనిపిస్తూ అందరి హృదయాలలో శాస్వితంగా నిలిచిపోయిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు ఒక్కరే.
నేడు ఆ మహానుభావుడి శత జయంతి. ఈ సందర్భంగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి హైదరాబాద్‌లో ఎన్టీఆర్ ఘాట్ వద్ద హడావుడి మొదలైంది. ఆయన కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకొని నివాళులు ఆర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుమార్తె దగ్గుపాటి పురందేశ్వరి దంపతులు, నందమూరి రామకృష్ణ, జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పించారు. హైదరాబాద్‌లో ఉన్న ఆయన అభిమానులు కూడా ఎన్టీఆర్ ఘాట్‌కు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు.
ఎన్టీఆర్ కుమారుడు, ప్రముఖ నటుడు, టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరులో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించి, స్థానిక వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
మరికొద్ది సేపటిలో ఒంగోలు మహానాడు రెండో రోజు సభలు ప్రారంభం కానున్నాయి. వేలాదిమంది తెలుగు తమ్ముళ్ళ సమక్షంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ముఖ్య నేతలు స్వర్గీయ నందమూరి తారక రామారావు సినీ పరిశ్రమకు, రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు, తెలుగు భాషకు చేసిన సేవలను స్మరించుకొని ఘనంగా నివాళులు అర్పించుకోనున్నారు.



