పరిపాలనా సౌలభ్యం కోసమని తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్, 10 జిల్లాల తెలంగాణాను 31 జిల్లాలుగా విభజించి మూడింతలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇదే బాటలో ముందుకు వెళ్ళాలని ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జిల్లాలను విభజించకుండానే ఆ పని చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది.
ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను మొత్తంగా 60 మినీ జిల్లాలుగా విభజించి పాలనను వికేంద్రీకరించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కార్యాచరణ రూపొందిస్తున్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరును పర్యవేక్షించాలని భావిస్తున్నారు. సర్కారు సరికొత్త నిర్ణయంతో ఆర్డీవోల పాత్ర మరింత విస్తృతం కానుంది. ఇంచుమించుగా కలెక్టర్ లాగానే అన్ని పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాల తీరును రెవెన్యూ డివిజన్లలో పర్యవేక్షించాల్సి ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాల్లో అధిక శాతం రెవెన్యూ డివిజన్లలోనే జరిగిపోవాలనేది సీఎం ఆలోచనగా చెబుతున్నారు.
అలాగే పోలీసు శాఖలో డీఎస్పీ పరిధిని ఆర్డీవోకు సమానంగా మార్చాలని నిర్ణయించారు. డీఎస్పీల స్థాయిని పెంచి ఎస్పీల అధికారాల్లో కొన్నింటిని వారికి అప్పగించాలని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉన్న డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ స్థాయి అధికారుల్లో సమర్థులను ఎంపిక చేసి వారిని ఆర్డీవోలు, డీఎస్పీలుగా నియమించాలని యోచిస్తున్నారు. ప్రభుత్వ పథకాల అమలులో వీరి పాత్రను కీలకం చేయనున్నారు.
త్వరలోనే ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలుపుతున్నాయి. జిల్లాలను ఏ మాత్రం విభజించకుండానే పరిపాలనను వికేంద్రీకరించాలన్న ముఖ్యమంత్రి నిర్ణయాన్ని పలువురు సమర్థిస్తున్నారు. అయితే ఇది ఆచరణకు ఎంతవరకు సాధ్యమో అన్న దానిపై తీవ్ర చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. ఒక్కసారి అమలుకు నోచుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి తగ్గితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది గనుక, పక్కా ప్రణాళికలతో అడుగులు వేయాల్సిందిగా అధికారులను సిఎం కోరినట్లుగా సమాచారం.



