A treat for mega fans!“భీమ్లా నాయక్” విడుదలకు ఒక రోజు ఉందనగా మెగా అభిమానులకు కావాల్సినంత కిక్ నిచ్చే విధంగా ఓ వీడియోను రిలీజ్ చేసారు రామ్ చరణ్ తేజ. బహుశా ఇలాంటి వీడియో వస్తుందని ఏ ఒక్కరూ కూడా ఊహించి వుండకపోవడమే, దీనిని మరింత స్పెషల్ గా మార్చింది.

“ది గాడ్ ఫాదర్” సినిమా పేరుతో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ‘గాడ్ ఫాదర్’ గెటప్ లో ఉన్న చిరంజీవి ‘భీమ్లా నాయక్’ సెట్స్ కు వెళ్లి కొంత సమయం గడపగా, తిరిగి మళ్ళీ పవన్ కళ్యాణ్ ‘ది గాడ్ ఫాదర్’ సెట్స్ కు వెళ్లి అక్కడ సమయం వెచ్చించడం అభిమానులకు ఈ వీడియో పండగలా మారింది.

‘జనసేన’ పార్టీ స్థాపించిన తర్వాత చిరంజీవి – పవన్ కళ్యాణ్ లు చాలా అరుదుగా ఒకే వేదిక పైన కనిపిస్తున్నారు. అది కూడా కుటుంబ వ్యవహారాల కలయికలో తప్ప, ఇతర సినీ వేదికలపై అస్సలు తారసపడడం లేదు. బహుశా ఆ లోటును తీర్చే విధంగా “ది గాడ్ ఫాదర్ – భీమ్లా నాయక్”ల షూటింగ్ కలయిక ఉందని చెప్పవచ్చు.

ఊహించని వీడియోను అందించినందుకు గానూ రామ్ చరణ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పే పనిలో సోషల్ మీడియా అభిమానులు ఉన్నారు. అందులోనూ ‘భీమ్లా నాయక్’ సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు ఫ్యాన్స్ కు ఇచ్చిన ఈ జోష్ మాములుగా లేదు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కంటే ఈ వీడియో ఫ్యాన్స్ కు మాంచి ఊపునిచ్చింది.