అక్కడ భోజనాలు, పగటి కలలు రెండూ కమ్మగా ఉంటాయి

Akhilesh Yadav and KTR meeting in Hyderabad amid Third Front political talks

ఉత్తర ప్రదేశ్ మాజీ సిఎం, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ నేడు హైదరాబాద్‌ వచ్చారు. సిఎం రేవంత్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన తర్వాత అక్కడి నుంచి నంది నగర్‌లో కేటీఆర్‌ ఇంటికి వెళ్ళారు. అక్కడ బీఆర్ఎస్‌ పార్టీ నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేటీఆర్‌, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితర ముఖ్యనేతలందరూ పాల్గొన్నారు.

తర్వాత హోటల్ తాజ్ కృష్ణాలో సమాజ్ వాదీ పార్టీ అధ్వర్యంలో జరిగిన ‘విజన్ ఇండియా సమ్మిట్’లో పాల్గొన్నారు. తర్వాత కేటీఆర్‌, అఖిలేష్ యాదవ్ తదితరులు కలిసి మాదాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌లో భోజనాలు చేశారు. ఈ సమావేశంలో వారు రాష్ట్ర, దేశ రాజకీయాల గురించి చర్చించుకున్నారని వేరే చెప్పక్కరలేదు.

ADVERTISEMENT

అఖిలేష్ యాదవ్ భారతదేశం భవిష్యత్ గురించి చర్చించేందుకు ఇలా దేశాటన చేస్తున్నారంటే నమ్మశక్యంగా లేదు. ఢిల్లీలో ప్రధాని కుర్చీలో మోడీ సెటిల్ అయిపోయారు. ఆయనని దించడం రాహుల్ వల్ల కావడం లేదు. అలాగే యూపీ సిఎం కుర్చీలో యోగీ ఆదిత్యనాథ్, బీహార్‌ కుర్చీలో నితీష్ కుమార్‌ బాగా సెటిల్ అయిపోయారు. వారినీ దించడం కాంగ్రెస్‌, సమాజ్ వాదీ, ఆర్‌జేడీ పార్టీల వల్ల కావడం లేదు.

బీజేపిని, ఎన్డీయేని, ముఖ్యంగా ప్రధాని మోడీ-కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను ఎదుర్కోవడానికే కాంగ్రెస్‌ మిత్ర పక్షాలు ‘ఇండియా కూటమి’ ఏర్పాటు చేసుకున్నాయి. కానీ అదో కప్పల తక్కెడలా మారింది. పైగా కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలిచినప్పటి నుంచి కాంగ్రెస్‌ నేతలు మళ్ళీ ‘రాహుల్ గాంధీ ప్రధాని’ పాట అందుకున్నారు. వారి పాట ఇండియా కూటమి ఐఖ్యతని దెబ్బ తీస్తూనే ఉంది.

ఈ నేపధ్యంలో అఖిలేష్ యాదవ్ మరోసారి ‘థర్డ్ ఫ్రంట్’ ఏర్పాటు కోసమే ఇలా ప్రయత్నాలు మొదలుపెట్టినట్లున్నారు. అక్కడ సమాజ్ వాదీ పరిస్థితి, ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్‌ పార్టీ పరిస్థితి ఒకేలా ఉన్నాయి. కనుక చేతులు కలపడానికి ఇది చాలు.

అందుకే రామేశ్వరం కేఫ్‌లో కలిసి భోజనాలు చేశారు. దాని వలన ఆ హోటల్‌కి ఫ్రీ పబ్లిసిటీ లభించింది. కనుక దాని బిజినీస్ మరింత పెరగవచ్చు. కానీ సమాజ్ వాదీ, బీఆర్ఎస్‌ పార్టీలతో మరో డజను పార్టీలు చేతులు కలిపినా పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

ఎందుకంటే, ముందుగా థర్డ్ ఫ్రంట్‌కి నాయకత్వం ఎవరు వహిస్తారు? ప్రధాన మంత్రి అభ్యర్ధి ఎవరు?అనే రెండు విషయాలపై వాటికి స్పష్టత లేదు. ఎందుకంటే దానిలో ఓ అరడజను ప్రధాని అభ్యర్దులున్నారు. కనుక ప్రధాని అభ్యర్ధి విషయంలో వాటి మద్య ఏకాభిప్రాయం ఎప్పటికీ కుదరదు. రాహుల్ గాంధీ ప్రధాని అని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకుంటున్నారు. అఖిలేష్ యాదవ్, కేటీఆర్‌ అంగీకరించగలరా?లేరు.

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023, యూపీ ఎన్నికలు 2027లో జరుగుతాయి. ఎన్నికలకు చాలా సమయమే ఉంది. కనుక అప్పటి వరకు ఇలా అప్పుడప్పుడు అందరూ కలిసి రామేశ్వరం కేఫ్‌లో టిఫినీలు, భోజనాలు చేస్తూ థర్డ్ ఫ్రంట్ గురించి ఎన్ని కబుర్లు అయినా చెప్పుకోవచ్చు. అక్కడి భోజనాల మాదిరిగానే ఆ పగటి కలలు కూడా చాలా కమ్మగా ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories