ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి స్పీడ్ బ్రేకర్స్… చూస్తున్నారా బాబూ?

Amaravati Development Hurdles

రాష్ట్రాభివృద్ధి జరగాలంటే అనేక అంశాలు కలిసి రావాలి. అవేమిటో అందరికీ తెలుసు. చాలా చాలా అంశాలు కలిసి వస్తేనే అభివృద్ధి సాధ్యం.

కానీ ఆ అభివృద్ధి జరగకుండా బ్రేకులు వేయడానికి ఇంతకంటే చాలా ఎక్కువే కారణాలు, శక్తులు ఉంటాయి. కనుకనే ఏ రాష్ట్రంలోనైనా అభివృద్ధి నత్తనడకన జరుగుతుంటుంది.

ADVERTISEMENT

ఉదాహరణకు ఏపీలో జగన్‌ ప్రభుత్వం అమరావతి నిర్మాణపనులు కొనసాగించి పూర్తిచేసి ఉండి ఉంటే, నేడు అయన పరిస్థితి, వైసీపీ పరిస్థితి, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది. కానీ జగన్‌ నిర్వాకం వలన ఆయనతో సహా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు కూడా నష్టపోయారు.

ఐదేళ్ళుగా నిర్లక్ష్యానికి గురైన అమరావతిని మళ్ళీ గాడిన పెట్టుకోవడానికే వేలకోట్లు ఖర్చయ్యాయి. దాదాపు 10-12 నెలల విలువైన సమయం కూడా వృధా అయిపొయింది.

కానీ సమస్యలన్నీ పరిష్కరించుకొని అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ పరుగులు పెడుతుంటే వైసీపీ నేతలు మళ్ళీ దానిపై దుష్ప్రచారం మొదలుపెట్టారు.

వారు కూటమి ప్రభుత్వానికి సహకరించకపోయినా పర్వాలేదు. కానీ రాజధాని నిర్మాణ పనులలో భారీగా అవినీతి జరిగిపోతోందంటూ, వరదలోస్తే మునిగిపోతుందంటూ దుష్ప్రచారం చేస్తున్నారు. తద్వారా ప్రజలలో అనుమానాలు, అపోహలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని అర్ధమవుతూనే ఉంది.

ఒకవేళ ప్రజలు వారి మాటలు నమ్మి ఆ జగన్మాయలో చిక్కుకుంటే అమరావతి పరిస్థితి ఏమిటి? అని తలుచుకుంటేనే ఆందోళన కలుగుతుంది.

కనుక రాజధాని నిర్మించడానికి డబ్బు, రాజకీయ సుస్థిరత ఉంటే సరిపోదు. పొంచి ఉన్న ఇలాంటి ప్రమాదాన్ని అడ్డుకోవడం కూడా అంతే అవసరం.

ఒక్క అమరావతి విషయంలోనే కాదు… పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు… వాటి కోసం భూసేకరణ, ఇలా అడుగడుగునా సమస్యలు సృష్టించడానికి వైసీపీ కాచుకు కూర్చుంది. విశాఖకు గూగుల్ కంపెనీ వస్తుంటే, వైసీపీ అధినేత జగన్‌, వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా మాట్లాడారో అందరూ విన్నారు.

కనుక అభివృద్ధికి అవరోధంగా ఉన్న ‘స్పీడ్ బ్రేకర్స్’ని ఎక్కడికక్కడ, ఎప్పటికప్పుడు గుర్తించి, తొలగించడానికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఓ వ్యవస్థని, యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం అవసరమనిస్తుంది. లేకుంటే అభివృద్ధి ఆలోచనలో పడి రాజకీయాలను నిర్లక్ష్యం చేసినా, రాజకీయాలలో చిక్కుకొని అభివృద్ధిలో వెనుకబడినా కధ మళ్ళీ మొదటికొస్తుంది.

ADVERTISEMENT
Latest Stories