ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల పరిస్థితి ప్రైవేట్ కంపెనీల ఉద్యోగుల కంటే దయనీయంగా మారింది. ఏపీ ప్రభుత్వం గత రెండేళ్ళుగా ప్రతీనెల జీతాలు ఆలస్యంగానే చెల్లిస్తోందని అయినా ఇంతకాలం చాలా ఓపిక పట్టామని ఏపీ ఉద్యోగుల జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి తాము జీతాల కోసం రోడ్లెక్కి ప్రభుత్వాన్ని అడ్డుక్కొనే పరిస్థితికి తీసుకువచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ఈ పరిస్థితి మారుతుందని తామందరం ఎంతో ఓపికగా ఎదురుచూస్తుంటే ప్రభుత్వానికి అది అలుసుగా మారిందని, ప్రతీనెల జీతాలు ఆలస్యంగా చెల్లించడం పరిపాటిగా మారిందని అన్నారు.
ప్రతీనెల 15, 20 తారీకులు వచ్చినా సగం మందికి జీతాలు పడక నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం తీరు చూస్తుంటే తమకి రావలసిన డీఏ బకాయిలు చెల్లించకుండా తప్పించుకొనేందుకే జీతాలు ఆలస్యం చేస్తోందా?అని అనుమానం కలుగుతోందన్నారు. చివరికి తామందరం ప్రభుత్వం సకాలంలో జీతాలు చెల్లిస్తే అదే గొప్ప అని అనుకొనే దుస్థితికి తీసుకురావడం ద్వారా డీఏ బకాయిల గురించి అడగలేని పరిస్థితి కల్పించిందని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
ఈ పరిస్థితి చూస్తుంటే రిటైర్ మెంట్ దగ్గర పడుతున్నవారు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఉద్యోగాలు చేస్తుంటేనే జీతాలు చెల్లించని ప్రభుత్వం రిటైర్ అయిన తర్వాత పెన్షన్ సకాలంలో చెల్లిస్తుందనే నమ్మకం లేకపోవడంతో తీవ్ర అభద్రతాభావానికి గురవుతున్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.
సమాజంలో ఎంతో గౌరవంగా బ్రతుకుతున్న తాము నెలరోజులు కష్టపడి పని చేసిన తర్వాత చేసిన పనికి జీతాలు చెల్లించాలంటూ రోడ్డుపై నిలబడి ధర్నాలు చేయవలసి వస్తుండటం చాలా అవమానంగా ఉందన్నారు. ఎన్నికలకి ముందు జీతభత్యాల చెల్లింపు గురించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పారో ఓ సారి గుర్తుచేసుకోవాలన్నారు.
ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు అంటే తమకి చాలా గౌరవమని అంటూనే మంత్రులు ఈవిదంగా తమని వేధిస్తుండటం సరికాదని అన్నారు. ఎన్నికల వరకు ఇలాగే సాగించాలని ప్రభుత్వం అనుకొంటున్నట్లయితే సంక్రాంతి పండుగ తర్వాత కార్యాచరణ ప్రకటించాల్సి వస్తుందని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయుల జీతభత్యాలు సకాలంలో చెల్లింపు కూడా ఒకటిగా ఉండాలి. అప్పుడే నెలనెలా జీతాలు చెల్లించగలగుతుంది. కానీ ప్రభుత్వం సంక్షేమ పధకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది కనుక నెలనెలా వాటి కోసం వందల కోట్లు ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనే ఆలోచనలో దొరికినకాడికి అప్పులు, ఓవర్ డ్రాఫ్టులు తీసుకొంటోంది. ఇంతగా ఆర్ధిక క్రమశిక్షణ లేని ప్రభుత్వాలు గతంలో ఎన్నడూ లేవు కనుకనే ఏనాడూ ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు జీతాభత్యాల కోసం, పెన్షన్ల కోసం పెన్షనర్లు రోడ్లేక్కేవారు కారు. కానీ ఇప్పుడు ప్రతీనెల జీతాల కోసం రోడ్లెక్కి ఆందోళనలు చేయవలసివస్తోంది. ఎలాగో 15-20 తేదీలలోగా జీతాలు పడితే, మళ్ళీ 1వ తేదీ నుంచి జీతాల కోసం ఎదురుచూపులు, పడకపోతే రోడ్లెక్కి ధర్నాలు చేయడం వారి జీవితాలలో భాగమైపోయిందిప్పుడు. రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకి నెలనెలా జీతాలు కూడా చెల్లించలేని పరిస్థితిలో ఉండటం ప్రభుత్వానికి అవమానంగా అనిపించకపోవడం విస్మయం కలిగిస్తుంది.



