అమరావతిని వ్యతిరేకిస్తున్నామని వైసీపీ నేతలు బొత్స, ధర్మాన తదితరులు మొన్ననే స్పష్టంగా చెప్పారు. నేడు జగన్ కూడా అదే మాట చెప్పబోతున్నారని సూచిస్తూ ఆయన ‘ఆత్మ సాక్షి’ ఓ పెద్ద కథనం ప్రచురించింది.
దానిలో రైతుకు అన్యాయం చేయడం, అవినీతి ఆరోపణలు, అప్పులు, రాష్ట్ర ఆర్ధికస్థితి, విభజన చట్టంలో క్లాజులు వగైరా పేర్కొని ‘అమరావతి నాటకం… చట్టబద్దత భూటకం’ అని ‘కట్టె కొట్టె తెచ్చె’ అన్నట్లు మూడు ముక్కలో తేల్చిపడేసింది.
ముందే చెప్పిన్నట్లు జగన్ ఇచ్చిన లైన్ ప్రకారమే బొత్స, ధర్మాన తదితరులు మాట్లాడారు. జగన్ మనసులో ఆలోచనలనే సాక్షి అక్షర రూపంలో ప్రచురించింది. కనుక నేడు తాడేపల్లి ప్యాలస్ ప్రెస్‌మీట్‌లో కూడా జగన్ ఇదే చెప్తారు. అయినా అధినేత ఒకలా, నేతలు మరోలా, వారి సొంత మీడియా మరొకలా చెప్పరు కదా? కనుక అమరావతిపై ముందనుకున్న లైన్ ప్రకారమే అందరూ మాట్లాడుతున్నారు.
ఈ సరికొత్త ఆరోపణలతో అమరావతి పట్ల, దానిని నిర్మిస్తున్న కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకత పెంచేలా చేయడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది.
ఎందుకంటే ‘అమరావతిని మేము అంగీకరించబోము’ అని తెగేసి చెప్తే ప్రజల ముందు వైసీపీ దోషిగా నిలబడాలి. రాష్ట్రాభివృద్ధిని వ్యతిరేకిస్తున్నందుకు ప్రజలు వైసీపీని మరోసారి ఓడిస్తారు.
అదే.. అమరావతిలో భారీగా అవినీతి జరిగిపోతోందని, అమరావతి వలన రాష్ట్రం అప్పులపాలై దివాలా తీసేస్తుందని పదేపదే గట్టిగా వాదిస్తుంటే ప్రజల కోపాన్ని సిఎం చంద్రబాబు నాయుడుపైకి మళ్ళించవచ్చు. ఇదే వైసీపీ సరికొత్త వ్యూహంగా కనిపిస్తోంది.
చంద్రబాబు నాయుడు చకా చకా అమరావతిని నిర్మిస్తుంటే, జగన్మోహన్ రెడ్డి నిమ్మకు నీరేత్తిన్నట్లు తాడేపల్లి ప్యాలస్‌లో కాలక్షేపం చేస్తున్నారని చాలామంది అపోహ పడి ఉంటారు. కానీ జగనేమీ చేతులు పిసుక్కుంటూ కూర్చోలేదని అమరావతికి ఈ కౌంటర్ వ్యూహం సిద్ధం చేశారని నిరూపించి చూపారు.
అమరావతి విషయంలో జగన్ వైఖరితో వైసీపీలో సైతం పలువురు ఆందోళన చెందుతుండటం సహజం. ఇలాంటి బలమైన్న వ్యూహం అందించడం ద్వారా అమరావతికి వ్యతిరేకంగా పోరాడవచ్చనే నమ్మకం వారికి కలిగించవచ్చు. అలాగే రాష్ట్రంలో వైసీపీ అనుకూల వర్గం ప్రజలందరినీ కూడా అమరావతిలో జరగకూడనిది ఏదో జరిగిపోతోందనే నమ్మకం కల్పించవచ్చు. కనుక ఇక నుంచి అమరావతికి అవినీతి ముద్ర వేసి వైసీపీ జోరుగా దుష్ప్రచారం చేయడం ఖాయం.
ఓ ఇంటిని నిర్మించడం చాలా కష్టం. కానీ కూల్చేయడం చాలా తేలిక. జగన్ ఇప్పుడు అదే చేయబోతున్నారు.
కనుక సిఎం చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మిస్తూనే, ఈ బుల్డోజర్ల నుంచి దానిని కాపాడుకోక తప్పదు. లేకుంటే 2019 స్టోరీ రిపీట్ అవుతుందని మరిచిపోకూడదు!




