దావోస్‌లో దోస్తీ…ఏపీతో కుస్తీ!

Andhra_Pradesh_and_Telanganaదావోస్‌లో తెలంగాణ మంత్రి కేటీఆర్‌, సిఎం జగన్మోహన్ రెడ్డి కలిసి ఫోటో దిగి 24 గంటలు గడవక మునుపే తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వంపై కృష్ణానదీ జలాల వినియోగంపై మళ్ళీ యుద్ధం మొదలుపెట్టడం విశేషం.

ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు టెండర్లు పిలవడంపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కృష్ణనదీ యాజమాన్య బోర్డులో ఫిర్యాదు చేసింది. విభజన చట్ట ప్రకారం చూసినా, ట్రిబ్యూనల్ నిబందనల ప్రకారమైనా ఈ పనులు చేపట్టడం చట్ట విరుద్దమని, కనుక ఏపీ ప్రభుత్వం ఈ పనులు ప్రారంభించకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి శ్రీశైలం జలాశయం నుంచి కేవలం 34 టీఎంసీలు నీళ్ళు మాత్రమే కేటాయించగా, అంతకు ముంచి తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ పనులకు టెండర్లు పిలిచిందని ఆరోపించింది. ఈ పనులు పూర్తయితే తెలంగాణ రాష్ట్రంలో శ్రీశైలం ప్రాజెక్టు మొదలు నాగార్జున సాగర్ వరకు కృష్ణా ఆయకట్టు దెబ్బ తింటుందని తెలంగాణ ప్రభుత్వం తెలియజేసింది.

తాము ఏపీ ప్రభుత్వానికి కూడా ఇదే విషయం తెలియజేసి పనులు నిలిపివేయాలని కోరినప్పటికీ పట్టించుకోకుండా టెండర్లు పిలిచి ఈనెల 23న తెరువబోతోందని తెలిపింది. కనుక ఏపీ ప్రభుత్వం ఆ పనులు ప్రారంభించకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది.

తెలంగాణ రాష్ట్రం ఎగువన ఉన్న కారణంగా కృష్ణా, గోదావరి నదులపై ఎక్కడికక్కడ ఆనకట్టలు కడుతూ, కాలువలు నిర్మించుకొని అన్ని జిల్లాలకు భారీగా నీటిని తరలించుకొంటోంది. ఇటీవలే నాగార్జునసాగర్ వద్ద మంత్రి కేటీఆర్‌ స్వయంగా సుంకీశాల వాటర్ ఇన్‌టేక్ పంప్‌హౌస్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్‌ నగరానికి మరో 50 ఏళ్ళవరకు త్రాగునీటి అవసరాలు తీర్చేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం రూ. 1,450 కోట్లు వ్యయంతో దీనిని నిర్మిస్తోంది.

అలాగే మహారాష్ట్ర నుంచి తెలంగాణ మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవహించే గోదావరి నదిపై కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అతి భారీ ప్రాజెక్టుతో సహా ఇంకా అనేక ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మించుకొంటోంది. వాటితో దిగువనున్న ఏపీకి అన్యాయం జరుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ ఏపీ ప్రభుత్వం ఏనాడూ తెలంగాణ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసి అడగలేదు.

కానీ దిగువన ఉన్న ఏపీలో ఏ చిన్న కాలువ తవ్వినా వెంటనే తెలంగాణ ప్రభుత్వం కోర్టులను, ట్రిబ్యూనల్‌లో కేసులు వేసి అడ్డుకొనేందుకుగా విశ్వప్రయత్నాలు చేస్తుంటుంది. టిఆర్ఎస్‌ ప్రభుత్వం తమ రాష్ట్ర ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తూ పోరాడుతుంటే, వైసీపీ ప్రభుత్వం టిఆర్ఎస్‌తో తమ అవసరాలు, తమ రాజకీయ ప్రయోజనాల గురించి మాత్రమే ఆలోచిస్తుండటం వలన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తీరని నష్టం జరుగుతుంది.

ADVERTISEMENT
Latest Stories