పదేళ్ళ తర్వాత కూడా ఏపీకి ఇంకా ఆటుపోట్లేనా?

Political instability and development challenges in Andhra Pradesh state politics

కొత్తగా ఏర్పడిన ఏ రాష్ట్రానికైనా మొదటి పది సంవత్సరాలు అత్యంత కీలకం. ఆ సమయంలో ప్రభుత్వం సరైన దిశలో ముందుకు సాగితే రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని తెలంగాణ రాష్ట్రం మన కళ్లెదుటే నిరూపించింది.

కానీ ఆంధ్రప్రదేశ్‌కు రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు గడిచినా ఇంకా ఆటుపోట్లు తప్పడం లేదు. జరిగినదేదో జరిగిపోయింది. ఇకనైనా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గట్టి ప్రయత్నాలు చేస్తోంది.

ADVERTISEMENT

దానికి వైసీపీ సహకరించకపోయినా పెద్ద సమస్య కాదు. కానీ అభివృద్ధికి దోహదపడే విధానాలకు ఆటంకం కలిగించడం, ప్రభుత్వంతో కలిసి పనిచేయాలనుకునే వారిని భయపెట్టడం మాత్రం ఆందోళన కలిగించే అంశం.

ఇవన్నీ చాలనట్లు, ఏదో ఒక పేరుతో వైసీపీ నిర్వహిస్తున్న బలప్రదర్శనలు ప్రజలను, అధికారులను, పారిశ్రామికవేత్తలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. మొన్న జగన్ పుట్టినరోజున రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనలు ఇందుకు నిదర్శనం.

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ బలంగా ఉండటం ప్రజాస్వామ్యానికి అవసరమే. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు ప్రతిపక్షాన్ని బలహీనపరిచే రాజకీయాలు చేయకపోవడం వైసీపీ అదృష్టమే అని చెప్పాలి.

ఇదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ హడావుడి పెరుగుతుండగా, తెలంగాణలో కేసీఆర్ మళ్లీ ఏపీపై నిప్పులు కక్కడం ప్రారంభించారు. ఆయన వ్యాఖ్యలు ఏపీ ప్రయోజనాలకు నష్టం కలిగించేలా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

అంతేకాదు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆ వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాననడం రాజకీయ సంకేతాలను మరింత గట్టిగా బయటపెడుతోంది. ఇది సాధారణ రాజకీయ వ్యాఖ్యగా తీసిపారేయలేని స్థితి.

జగన్ పుట్టినరోజు సందర్భంగా ఇటు వైసీపీ, అటు బీఆర్ఎస్ తమ అధినేతల మధ్య ఉన్న బలమైన బంధాన్ని మరోసారి బహిర్గతం చేశాయి. ఈ రాజకీయ సాన్నిహిత్యం ఏపీకి ప్రమాదకరంగా మారుతుందన్న భావన బలపడుతోంది.

సీఎం చంద్రబాబు నాయుడు రాజకీయ స్థాయిని చూసి కేసీఆర్ ఓర్వలేకపోవడం సహజమే. కానీ అలాంటి వ్యక్తితో జగన్ చేతులు కలపడం సబబేనా అనే ప్రశ్న తప్పక తలెత్తుతుంది.

వైసీపీ వైఖరి వల్ల ప్రజలకు, పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి. వాటి ప్రభావం చివరికి రాష్ట్రానికే కాదు, వైసీపీకి కూడా నష్టం చేస్తుందన్న విషయం తెలిసినా గట్టి నివారణ చర్యలు కనిపించడం లేదు.

గతంలో పాలన, అభివృద్ధిపైనే దృష్టి పెట్టి రాజకీయాలను నిర్లక్ష్యం చేయడం వల్ల ఎదురుదెబ్బ తిన్నామని చంద్రబాబు స్వయంగా అంగీకరించారు. నేటికీ అదే ధోరణి కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది.

ADVERTISEMENT
Latest Stories