ఒకప్పుడు తెలంగాణతో కలిసి ఉండేవాళ్ళం… నేటికీ లక్షలాది ఆంధ్రావాసులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. కనుక తెలంగాణ రాజకీయాలపై ఆంధ్ర ప్రజలు కాస్త ఆసక్తి చూపడం సహజమే.
కానీ తమిళనాడు రాజకీయాలు మనకెందుకు?అంటే ‘అవును మనకి అవసరమే లేదని’ ఆంధ్ర ప్రజలు ముక్తకంఠంతో చెపుతారు.
కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణకు నడుం బిగించాక, తమిళ రాజకీయాలతో అనూహ్యంగా కనెక్షన్ ఏర్పడింది. నిజానికి జగన్‌కి చెక్ పెట్టేందుకు పవన్ కళ్యాణ్ సనాతన దీక్ష చేపట్టారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా సనాతన మార్గం పవన్ కళ్యాణ్‌ని తమిళనాడు వైపుకి తీసుకుపోతోంది.
సనాతన ధర్మ పరిరక్షణ అంటే హిందూ ధర్మ పరిరక్షణ మాత్రమే కదా?మరి దానికీ తమిళనాడు రాజకీయాలకు సంబందం ఏమిటి?అనే ధర్మసందేహం కలుగకమానదు.
తమిళనాడులో బీజేపీకి బలమైన ‘హిందూ ఫౌండేషన్’ వేసేందుకే పవన్ కళ్యాణ్ ధర్మ మార్గంలో అటువైపు ప్రయాణిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి.
అవి నిజమేనని తమిళనాడులో అధికార డీఎంకే పార్టీ స్పందనలు సూచిస్తుంటే, వాటికి పవన్ కళ్యాణ్ ఇస్తున్న కౌంటర్స్ కూడా ధృవీకరిస్తున్నట్లున్నాయి.
పవన్ కళ్యాణ్ తాజా ట్వీట్ ఇందుకు మరో నిదర్శనంగా కనిపిస్తోంది. ఈ నెల 17వ తేదీన తమిళనాడులో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నా డీఎంకే 53వ వ్యవస్థాపక దినోత్సవం జరుగబోతోంది.
పవన్ కళ్యాణ్ ఆ పార్టీ వ్యవస్థాపకుడు, తమిళ సినీ అభిమానుల ఆరాధ్య దైవం స్వర్గీయ ఎంజీఆర్‌ని పొగుడుతూ ట్వీట్ చేశారు.
తాను మద్రాసులో ఉన్నప్పటి నుంచే ఎంజీఆర్ అంటే చాలా అభిమానం, గౌరవం ఉండేదని, ఆయన మంచి లక్షణాలతో మారాజులా వెలుగొందారని, నేటికీ తనకు ఆయన అంటే చాలా అభిమానమని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు.
అన్నా డీఎంకే 53వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలందరికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు.
ఎంజీఆర్‌పై ఇంత అభిమానం ఉన్న పవన్ కళ్యాణ్ ఇదివరకు ఎన్నడూ ఆ పార్టీకి అభినందనలు తెలియజేయలేదు. సనాతన ధర్మ మార్గంలో అటువైపు ప్రయాణించడం మొదలుపెట్టిన తర్వాతే పవన్ కళ్యాణ్‌లో ఈ మార్పు వచ్చింది.
అంటే సనాతన ధర్మ మార్గం పవన్ కళ్యాణ్‌ని తమిళనాడువైపుకి నడిపిస్తోందనే డీఎంకే భయాలు నిజమే అని అర్దమవుతోంది.
“నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా?” అన్నట్లు కేసీఆరే మనల్ని ఒప్పుకోలేదు. ఇక స్టాలిన్ అండ్ సన్స్ ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అప్పుడు ఆంధ్రా-తమిళనాడు మద్య ఏదో చిచ్చు రగిలే ప్రమాదం ఉంటుంది.
ఇప్పటికే ఆంధ్రా-తెలంగాణల మద్య చిచ్చు రగులుతూనే ఉంది. తెలంగాణ నేతలతో తిట్టుకున్నా కొట్టుకున్నా మనం మనం బరంపురమే కనుక అర్దమవుతుంది. కానీ తమిళులతో గొడవలు మొదలైతే వారు మనల్ని తిడుతున్నా అర్ధం కాదు.
కనుక పవన్ కళ్యాణ్ ప్రయాణం తమిళనాడు వైపు సాగబోతోందా లేదా?అని సిఎం చంద్రబాబు నాయుడు ఇప్పుడే నిర్ధారించుకోవడం చాలా అవసరం.




