ఒకరు స్వప్రయోజనాల కోసం…మరొకరు రాష్ట్రాల అభివృద్ధికి స్నేహాలు

AP-Telangana Cooperation Grows Ahead of Rising Summit

ఈ నెల 8,9 తేదీలలో హైదరాబాద్‌లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ జరుగబోతోంది. సిఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోడీని, కేంద్ర మంత్రులను స్వయంగా ఆహ్వానించారు. తన మంత్రులను ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకి ఆహ్వానాలు పంపారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి శుక్రవారం అమరావతికి వచ్చి ఏపీ సిఎం చంద్రబాబు నాయుడుని కలిసి సదస్సులో పాల్గొనవలసిందిగా ఆహ్వానించారు.

ADVERTISEMENT

ఆయన ఏపీని, చంద్రబాబు నాయుడుని శత్రువుగా చూస్తున్న తెలంగాణకు చెందినవారు. పైగా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. చంద్రబాబు నాయుడు బీజేపీతో కలిసి పని చేస్తున్నారు.

కానీ పార్టీలు, రాజకీయ విభేధాలు పక్కన పెట్టి వారిరువురూ మనసు విప్పి సుమారు గంటన్నర సేపు ఏపీ, తెలంగాణ రాజకీయాలపై మాట్లాడుకున్నారు.

రాష్ట్రాల మద్య సంబంధాలు బలపడటానికి, పరస్పరం సహకరించుకోవడం చాలా అవసరం. ఇటువంటి సహృద్భావ వాతావరణం ఏర్పడితే అందరికీ లాభమే తప్ప నష్టం ఉండదు.

ఏవిధంగా అంటే, వరంగల్‌తో సహా రాష్ట్రంలో కొత్తగా నాలుగైదు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు నాడు కేసీఆర్‌ హయం నుంచే తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కానీ కేసీఆర్‌ కేంద్రంపై కత్తులు దూయడం వలన సాధ్యపడలేదు. కానీ ఇప్పుడు సిఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోడీ సఖ్యతగా ఉంటున్నారు.

ఇప్పుడు టీడీపీకి చెందిన రామ్మోహన్‌ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. అందువల్లే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు చురుకుగా సాగుతున్నాయి. అమరావతితో సహా మరో అరడజను విమానాశ్రయాల ఏర్పాటుకి చురుకుగా సన్నాహాలు జరుగుతున్నాయి.

కనుక తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పాటుకి తోడ్పడాల్సిందిగా కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడుని సిఎం చంద్రబాబు నాయుడు కోరగలరు. అప్పుడు తెలంగాణలో కొత్త విమానాశ్రయాలు ఏర్పడతాయి.

మాజీ సిఎంలు కేసీఆర్‌, జగన్‌ ఇద్దరి మద్య, వారి పార్టీల మద్య ఇంతకంటే చాలా బలమైన అనుబందమే ఉంది. వారి సొంత మీడియా, సోషల్ మీడియా మద్య కూడా అటువంటి అనుబంధమే ఉంది.

కానీ వారు అనుబంధాన్ని తమ పార్టీ ప్రయోజనాలు, రాజకీయ లబ్ధి కోసమే ఉపయోగించుకునేవారు. నేటికీ అలాగే ఉన్నారు.. అలాగే సహకరించుకుంటున్నారు కూడా!

ఉదాహరణ-1: చంద్రబాబు నాయుడుని గద్దె దించి జగన్‌ ముఖ్యమంత్రి అయ్యేందుకు కేసీఆర్‌ సహాయపడ్డారు. అందుకు ప్రతిగా జగన్‌ అమరావతిని పక్కన పెట్టి ఏపీకి రావాల్సిన పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటి కంపెనీలు హైదరాబాద్‌ తరలించుకు పోయేందుకు తోడ్పడ్డారు. .

ఉదాహరణ-2: కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేక విమానం వేసుకొని దేశంలో పలు రాష్ట్రాలలో పర్యటించి ముఖ్యమంత్రులను కలిశారు. కానీ దేనికి? పరస్పరం సహకరించుకొని రాష్ట్రాలను అభివృద్ధి చేసుకుందామని కాదు. మోడీని గద్దె దించి తాను ప్రధాని అవుదామని!

కనుక జగన్‌, కేసీఆర్‌ ఇద్దరూ తమ సొంత ప్రయోజనాల కోసం, పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసమే స్నేహాలు చేశారని స్పష్టమవుతోంది.

కానీ ఏపీ, తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి వారికి భిన్నంగా అందరినీ కలుపుకుపోతూ రాష్ట్రాలు అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు.

ఈ సదస్సు ద్వారా తెలంగాణ రాష్ట్రానికి భారీగా పరిశ్రమలు, పెట్టుబడులు ఆకర్షించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. కనుక సిఎం చంద్రబాబు నాయుడు అసూయ పడలేదు. తెలంగాణకు మరిన్ని పరిశ్రమలు, పెట్టుబడులు రావాలని, వస్తే ఏపీకి మేలు కలుగుతుందని భావించారు.

రాష్ట్రాల మద్య , ముఖ్యమంత్రులు, ప్రభుత్వాల మద్య ఇటువంటి సహృద్భావం చాలా అవసరం. దాని వలన అందరూ లాభపడతారు తప్ప ఎవరూ నష్టపోరు కదా?

ఏపీ తెలంగాణ రాష్ట్రాలు కలిసి మెలిసి ముందుకు సాగితే రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందుతాయి. మరింత వేగంగా అభివృద్ధి సాధిస్తాయి.

ADVERTISEMENT
Latest Stories