కేసీఆర్‌ కుటుంబ పాలనను తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నారా?

K_Chandrashekar_Rao_Telangana_CMప్రధాని నరేంద్రమోడీ ఈరోజు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవం, స్నాతకోత్సవ కార్యక్రమాలలో పాల్గొనేందుకు హైదరాబాద్‌ వచ్చారు. ఎప్పటిలాగే సిఎం కేసీఆర్‌ ఆయనకు మొహం చాటేసి బెంగళూరు వెళ్ళిపోయారు. కనుక గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, బిజెపి నేతలు తదితరులు ఆయనకు బేగంపేట విమానాశ్రయంలో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం అక్కడ జరిగిన చిన్న సభలో ప్రధాని నరేంద్రమోడీ ప్రసంగిస్తూ, సిఎం కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, కనుక కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతమొందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేసీఆర్‌ను ఎందుకు గద్దె దింపాలో ప్రధాని నరేంద్రమోడీతో సహా రాష్ట్ర బిజెపి నేతలు అందరూ స్పష్టంగానే చెపుతున్నారు కానీ బిజెపినే ఎందుకు గెలిపించాలో బలమైన కారణం చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో బిజెపి అధికారలోకి వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ (కేంద్రంలో రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వాలు)తో తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి జరుగుతుందని చెపుతున్నారు.

ADVERTISEMENT

అయితే తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఈ 8 ఏళ్ళలో అన్ని రంగాలలో ఆ రాష్ట్రంలో చాలా అభివృద్ధి సాధించింది. ఒకవేళ ఇంకా అభివృద్ధి సాధించాల్సిన అవసరం ఉందనుకొంటే, కేంద్రప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి అన్ని విధాలా సహాయసహకారాలు అందించవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని సిఎం కేసీఆర్‌తో సహా అందరూ పదేపదే ఆరోపిస్తున్నారు.

టిఆర్ఎస్‌ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. రాష్ట్ర బిజెపి నేతలు కూడా టిఆర్ఎస్‌ నేతల అవినీతి చిట్టా తమ వద్ద ఉందని తరచూ బెదిరిస్తుంటారు. అప్పుడు “చిట్టా మీ దగ్గరే ఉన్నప్పుడు మాపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?” అని టిఆర్ఎస్‌ నేతలే బిజెపిని నిలదీస్తుంటే దానికి వారి నుంచి సమాధానం లేదు.

ఇక పోరాడి సాధించుకొన్న తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం చేతిలో బందీ అయిపోయిందని, తెలంగాణ ఫలాలు కేసీఆర్‌ కుటుంబం ఒక్కటే అనుభవిస్తోందని, కనుక కుటుంబ పాలనను అంతం చేయాలని అన్నారు. అయితే కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రజల అవసరాలు తీర్చుతునంత కాలం వారి పాలన పట్ల ప్రజలకు అభ్యంతరాలు చెప్పవలసిన అవసరం లేదు.

సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌, బిజెపిలతో ఏవిదంగా వ్యవహరిస్తున్నారనేది కూడా వారికి అనవసరం. కనుక బిజెపి నేతలు పదేపదే కుటుంబ పాలన అని నొక్కి చెప్పినా ఎటువంటి ప్రయోజనం ఉండకపోవచ్చు. అందుకే బి‌జే తమకు కొట్టిన పిండి వంటి హిందుత్వ అజెండాను తెలంగాణలో అమలుచేస్తూ దూసుకుపోతోంది. దానికి విరుగుడుగా టిఆర్ఎస్‌ తెలంగాణ సెంటిమెంటు అస్త్రాన్ని ప్రయోగిస్తోంది. బిజెపి రాష్ట్రంలో సిఎం కేసీఆర్‌ను గద్దె దించాలని ప్రయత్నిస్తుంటే, సిఎం కేసీఆర్‌ ఢిల్లీలో నరేంద్రమోడీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని ప్రయత్నిస్తుండటం విశేషం.

ADVERTISEMENT
Latest Stories