ఢిల్లీ ఎన్నికలతో బిఆర్ఎస్‌ పార్టీకి ఇబ్బంది తప్పదా?

arvind-kejriwal-aap

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సుమారు ఆరు నెలలు జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చారు. ఆ కేసులో అరెస్ట్ అయిన అర్వింద్ కేజ్రీవాల్‌, మనీష్ సిసోడియా తదితరులు అందరూ కూడా బెయిల్‌పై బయటకు వచ్చేశారు. బయటకు వచ్చిన వారందరూ ‘చివరికి న్యాయం ధర్మం గెలిచాయని’ చెప్పారు.

ADVERTISEMENT

అంటే ఈ కేసు ఓ భూటకమని, తాము ఎటువంటి అవినీతికి పాల్పడకపోయినా ఈ భూటకపు కేసుతో మోడీ ప్రభుత్వం తమపై రాజకీయ కక్ష సాధింపుకి పాల్పడిందని వారు వాదిస్తున్నారు. వారి వాదనలను బీజేపీ కూడా ఖండించ లేదు!

ఈ కేసు విచారణ పేరుతో ఇంతకాలం హడావుడి చేసిన ఈడీ, సీబీఐలు కూడా ఇప్పుడు సైలంట్ అయిపోయాయి. ఈ కేసులో ఎటువంటి కదలికలు లేకుండా నిలిచిపోయింది.

ఇదివరకు ఈ కేసు గురించి పెద్ద నోరు పెట్టుకొని మాట్లాడిన బిఆర్ఎస్‌ నేతలు, ఈ కేసులో జైలుకి వెళ్ళివచ్చిన కల్వకుంట్ల కవిత కూడా పూర్తిగా సైలంట్ అయిపోయారు. అంటే ఇక్కడితో ఈ కధ సమాప్తం అనుకోవాలన్న మాట!

కానీ అర్వింద్ కేజ్రీవాల్‌ ఇప్పుడు ఇదే కేసుతో ఢిల్లీలో బీజేపీని శాసనసభ ఎన్నికలలో ఎదుర్కొబోతున్నారు! తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలు నమ్మితేనే తమ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలని కోరుతున్నారు.

కంట్లో నలుసులా, పంటికి కింద రాయిలా మారిన అర్వింద్ కేజ్రీవాల్‌ని ఈ లిక్కర్ స్కామ్‌ కేసుతోనే రాజకీయంగా దెబ్బ తీయాలని బీజేపీ భావించింది. కానీ ఇప్పుడు ఆయన అదే కేసుని రామబాణంలా బీజేపీపైకి సందిస్తుండటం విశేషం.

ఇది బీజేపీ ఊహించని పరిణామమే. కనుక లిక్కర్ స్కామ్‌ నిజమైనదే అని, దానిలో అర్వింద్ కేజ్రీవాల్‌తో సహా ఆయన మంత్రులు అవినీతికి పాల్పడ్డారని ఢిల్లీ ప్రజలను నమ్మించాల్సి ఉంది. లేకుంటే ఈ భూటకపు కేసులో ఆయనను అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టి వేధించిందని ఢిల్లీ ప్రజలు ఆయనపై సానుభూతి చూపితే ఢిల్లీలో మళ్ళీ ఆమాద్మీ ప్రభుత్వం ఏర్పడుతుంది. అర్వింద్ కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అవుతారు. ఒకవేళ ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితే రాజకీయంగా ఆయన ఇంకా బలపడతారు.

కనుక లిక్కర్ స్కామ్‌ కేసుని మళ్ళీ కదిలించక తప్పకపోవచ్చు. తీగ లాగితే డొంక కదిలిన్నట్లు ఆ కేసులో కదలికలు వస్తే మళ్ళీ కల్వకుంట్ల కవితకి మళ్ళీ కష్టాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

ఆమెను ఇబ్బంది పెడితే బిఆర్ఎస్‌ పార్టీతో సంబంధాలు దెబ్బ తింటాయని బీజేపీ అధిష్టానం భావిస్తే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుని కదపకుండానే అర్వింద్ కేజ్రీవాల్‌ని ఎదుర్కోవలసి ఉంటుంది. కానీ అలా చేస్తే అర్వింద్ కేజ్రీవాల్‌ వాదనలు నిజమని ఢిల్లీ ప్రజలు నమ్మే అవకాశం ఉంటుంది. కనుక ఢిల్లీ శాసనసభ ఎన్నికల కోసమైనా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఈ లిక్కర్ స్కామ్‌ కేసుని కదపక తప్పేలా లేదు. అంటే ఢిల్లీ ఎన్నికలు బిఆర్ఎస్‌ పార్టీకి మళ్ళీ కొత్త సమస్య తెచ్చిపెట్టేలా ఉన్నాయనుకోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories