అట్టహాసంగా పండగ వాతావరణంలో జరుగుతున్న మహానాడులో టిడిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘సామాజిక భేరీ’ పేరుతో వైసీపీ మంత్రులు చేస్తున్న బస్సు యాత్రను ఆలీబాబా నలబై దొంగల యాత్రగా అభివర్ణించారు.
రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలలో 80 శాతం మంది ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉన్నారని ఇంటలిజన్స్ వర్గాలు నివేదిక సమర్పించడంతో సిఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళనకు గురయ్యారని, కనుక ఆయా వర్గాల వారిని వైసీపీ వైపు తిప్పుకోకపోతే వచ్చే ఎన్నికలలో నష్టపోతామనే భయంతోనే హడావుడిగా తన మంత్రులతో బస్సు యాత్ర మొదలుపెట్టించారని అచ్చన్న అన్నారు.
అయితే టిడిపి ఆవిర్భవించిన తరువాతే బడుగు బలహీన వర్గాలను అక్కున చేర్చుకొని వారికి పార్టీలో, ప్రభుత్వంలో సముచిత స్థానాలు కల్పించి గౌరవించిందని అన్నారు. కనుక వారు ఎల్లప్పుడూ టిడిపి వెంటే ఉంటారని అన్నారు. ఆ విషయం గ్రహించే సిఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో ఈ బస్సు యాత్ర చేయిస్తున్నారని అన్నారు.
కానీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజల గడపల వద్దకు వెళితేనే ఛీత్కారాలు ఎదురవుతున్నప్పుడు, బస్సు యాత్రలను ఎవరు పట్టించుకొంటారని కింజారపు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. బస్సు యాత్ర చేస్తున్న ఆలీబాబా ముఠా మీ వద్దకు వస్తే ఈ మూడేళ్ళలో మీరు ఏమి చేశారని గట్టిగా నిలదీయండని అచ్చన్న ప్రజలకు సూచించారు.
తెలుగుదేశం పార్టీ ప్రజల హృదయాల లోనుంచి ఉద్భవించిన పార్టీ కనుక దానిని ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరని అన్నారు. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని అయితే ఈసారి 160 సీట్లు సాధించాలనే లక్ష్యంతో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.
జగన్ ప్రభుత్వం టిడిపి కార్యకర్తలపై ఎన్ని అక్రమ కేసులు పెట్టినప్పటికీ భయపడవద్దని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే ఒకే ఒక సంతకంతో అన్ని కేసులను ఎత్తివేస్తారని కింజారపు అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు.
అచ్చెన్నాయుడు వైసీపీ మంత్రుల బస్సు యాత్ర గురించి ఓ కొత్త విషయం చెప్పారనుకోవచ్చు. సిఎం జగన్మోహన్ రెడ్డి చేతిలోనే ఇంటలిజన్స్ ఉంటుంది కనుక రాష్ట్రంలో వైసీపీ, టిడిపిల పరిస్థితి ఏవిదంగా ఉందనేది ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకోగలరు.
అయితే సంక్షేమ పధకాల పేరిట బడుగు బలహీన వర్గాల వారికి గత మూడేళ్ళుగా ఎన్ని పప్పు బెల్లాలు పంచిపెడుతున్నప్పటికీ వారిని సిఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నమ్ముతున్నట్లు లేదు. లోలోన ఇంకా ఏవో భయాలు, అనుమానాలు ఉండే ఉంటాయి. బహుశః అందుకే ఇటువంటి బీసీ ప్రసన్న మంత్రాలు చదువుతున్నట్లున్నారు.



