మాజీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతితో నెల్లూరు జిల్లా, ఆత్మకూరు నియోజకవర్గానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీని కోసం కేంద్ర ఎన్నికల సంఘం బుదవారం షెడ్యూల్ ప్రకటించింది.
ఈ నెల 30వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుంది. జూన్ 6వరకు నామినేషన్ల స్వీకరణ, 7వ తేదీన పరిశీలన, 9వ తేదీన ఉపసంహరణకు గడువు, జూన్ 23న ఉపఎన్నిక జరుగబోతోంది. జూన్ 26వ తేదీన ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు.
ప్రస్తుతం రాష్ట్రంలో టిడిపి, జనసేనలు పొత్తులు పెట్టుకోనప్పటికీ భవిష్యత్‌లోకలిసి పనిచేయబోతున్నట్లు స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నాయి. కనుక ఈ ఉపఎన్నికలో ఆ రెండు పార్టీలు సహకరించుకోవచ్చు. ఇప్పటికే మూడేళ్ళు పూర్తయి, ఇంకా రెండేళ్ళ పదవీ కాలం మాత్రమే మిగిలి ఉన్నందున ఈ ఉపఎన్నికలో టిడిపి అభ్యర్ధిని నిలబెడుతుందా లేక జనసేనకు అవకాశం ఇచ్చి మద్దతు ఇస్తుందా?అనేది జూన్ 6న నామినేషన్ల ప్రక్రియ మొదలైన తరువాత స్పష్టత వస్తుంది.
ఆర్నెల్ల క్రితం వరకు రాష్ట్రంలో వైసీపీ ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగుతోంది. కానీ వైసీపీ ప్రభుత్వం వేస్తున్న తప్పటడుగులే టిడిపి, జనసేనలను మళ్ళీ పుంజుకొని సవాల్ చేసే స్థాయికి చేర్చాయని చెప్పవచ్చు. కనుక ఈ ఉపఎన్నికలో వాటి నుంచి వైసీపీ చాలా గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉంటుంది.
రాష్ట్రంలో ఇటీవల జరిగిన వరుస హత్యలు, అత్యాచారాలు, వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు వ్యవహారం, తాజాగా కోనసీమ చిచ్చు వంటివి టిడిపి, జనసేనలకు అస్త్రాలుగా మారితే, అవే వైసీపీకి ఉపఎన్నికలో ప్రతికూలాంశాలు కాబోతున్నాయి.
సరిగ్గా ఉపఎన్నికలకు ముందే అంటే రేపటి నుంచి నాలుగు రోజుల పాటు ఒంగోలులో మహానాడు కూడా జరుగబోతోంది. కనుక మహానాడు టిడిపి శ్రేణులలో ఉత్సాహం మరింత పెంచుతుంది. ఇక ఈ ఎన్నికలను జగన్ పాలనకు రిఫరెండంగా చంద్రబాబు నాయుడు ప్రకటించినట్లయితే, వైసీపీకి మరింత గడ్డు పరిస్థితి ఎదురవవచ్చు.
ఇక వైసీపీ కోణంలో నుంచి చూస్తే, మేకపాటి మృతితో నియోజకవర్గ ప్రజలలో ఏర్పడే సానుభూతి, సంక్షేమ పధకాలు, గడప గడపకు కార్యక్రమం చెప్పుకోవచ్చు. కోనసీమ అల్లర్లలో ప్రతిపక్షాలను నిందిస్తునప్పటికీ శాంతిభద్రతలు కాపాడటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయ్యిందనే టిడిపి, జనసేనల వాదనతో ప్రజలు ఏకీభవించవచ్చు.
ఏది ఏమైనప్పటికీ ఈ ఉపఎన్నిక వైసీపీకి ప్రతిష్టాత్మకం కానుండగా, టిడిపి, జనసేనలకు తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఓ గొప్ప అవకాశంగా భావించవచ్చు. కనుక ఆత్మకూరులో పోరు భీభత్సంగానే ఉండవచ్చు.



