జానీ మాస్టర్‌… ఈ సమయంలో అవార్డ్ అవసరమా?

Jani Master Bail

కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ అవార్డుల కోసం దేశంలో పలువురు హేమాహేమీలు ఆశపడుతుంటారు. కనుక కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి జాతీయ అవార్డు లభిస్తే తీసుకోవాలని అనుకోవడం తప్పు కాదు.

తమిళ సినిమా ‘తిరు చిట్రంబళం’ అనే సినిమాకి ఉత్తమ కొరియోగ్రఫీ విభాగంలో జాతీయ అవార్డుకి ఎంపికైంది. ఆ సినిమాకి జానీ మాస్టర్, సతీష్ కృష్ణన్ మాస్టర్‌ ఇద్దరూ కలిసి చేశారు. కనుక ఈ నెల 8న ఢిల్లీలో జరిగే 70వ జాతీయ అవార్డుల ప్రధాన కార్యక్రమంలో ఇద్దరూ కలిసి ఈ అవార్డు అందుకోబోతున్నారు.

ADVERTISEMENT

ఇంతవరకు బాగానే ఉంది. అయితే జానీ మాస్టర్‌ అత్యాచార ఆరోపణలతో ప్రస్తుతం జైలులో ఉన్నారు. కనుక జాతీయ అవార్డు అందుకోవడం కోసం కోర్టుని అభ్యర్ధించగా ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు షరతులతో మద్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

రూ.2 లక్షలు విలువ కలిగిన రెండు పూచీకత్తులు సమర్పించాలని, అక్టోబర్‌ 10వ తేదీ ఉదయం 10 గంటలకు కోర్టుకి వచ్చి లొంగిపోవాలని షరతులు విధించింది.

బెయిల్‌పై బయట ఉన్నప్పుడు ఈ కేసు గురించి ఎవరితో మాట్లాడరాదని, ముఖ్యంగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వరాదని న్యాయస్థానం షరతులు విధించింది. వాటికి ఆయన అంగీకరించడంతో న్యాయస్థానం మద్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

జానీ మాస్టర్‌ జాతీయ అవార్డు గెలుచుకోవడం ఆయన కెరీర్‌లో ఓ మైలురాయి కాగా, అత్యాచారం, లైంగిక దాడి కేసులలో పోక్సో చట్టం కింద అరెస్ట్ కాబడి జైలుకి వెళ్ళాల్సిరావడం ఆయన జీవితంలో అత్యంత హీనమైన దశ అని చెప్పవచ్చు. ఒకరి జీవితంలో ఒకే సమయంలో ఇటువంటి రెండు పూర్తి భిన్నమైన దశలు చూడటం విశేషమే.

ఇటువంటి హేయమైన నేరానికి పాల్పడినట్లు జానీ మాస్టర్‌ ఆరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్నప్పుడు, ఆయనకి జాతీయ అవార్డు ప్రధానంపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి ఉండాలి.

ఆయన నిర్ధోషిగా బయటకు వస్తే అప్పుడు ప్రతిష్టాత్మకమైన ఆ జాతీయ అవార్డు ప్రధానం చేయడం, ఆయన అందుకోవడం రెండూ హూందాగా ఉంటాయి.

కానీ ఈ హేయమైన నేరానికి జైల్లో ఉన్న జానీ మాస్టర్‌ బెయిల్‌ తీసుకొని ఢిల్లీ వస్తే, కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ అవార్డు ఇవ్వబోతోంది. ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇచ్చిన్నట్లవుతుంది కదా?న్యాయవిచారణపై ప్రభావం చూపకుండా ఉంటుందా?

జానీ మాస్టర్‌ ఈ నేరం చేశాడని ఇంకా కోర్టులో నిరూపితం కాలేదు కనుక అంతవరకు ఆయన కేవలం ముద్దాయి మాత్రమే. అయినా ఇటువంటి పరిస్థితులలో బెయిల్‌ తీసుకొని ఢిల్లీకి వస్తే సాటి అవార్డు గ్రహీతలు నవ్వరా?వారు, మీడియా ప్రతినిధులు ఈ కేసు గురించి అడిగితే ఏమని చెప్పుకుంటారు?

అసలు ఇటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నలుగురి మద్యకు వెళ్ళడానికే ఆయన సిగ్గుపడాలి. కానీ బెయిల్‌ తీసుకొని మరీ వెళుతున్నారు! ఇది ఆయనకు, ఈ అవార్డు ఇస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఇద్దరికీ గౌరవం కాబోదు.

ADVERTISEMENT
Latest Stories