అలనాటి విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా అశేష పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న ఎన్టీఆర్ పేరు మీద హైదరాబాద్ లో తారకరామా థియేటర్ గొప్పగా నడిచిన సంగతి మొన్నటి తరం ప్రేక్షకులకు బాగా గుర్తు. భాగ్యనగర వాసులకు దాంతో ఎన్నో జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మూతబడిన ఈ వింటేజ్ హాల్ ఈ నెల 14న నందమూరి బాలకృష్ణ చేతుల మీదుగా ఏషియన్ తారకరామా సినీ ప్లెక్స్ గా రీ ఓపెనింగ్ కానుంది. కాచిగూడ స్టేషన్ మీదుగా ప్రయాణం సాగించే వాళ్ళకు ఆ ప్రాంత వాసులకు ఎంతో సుపరిచితమైన ఈ థియేటర్ వెనుక ఆసక్తికరమైన కొన్ని విశేషాలు అరుదైన రికార్డులు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం
తారకరామా థియేటర్ ని 1978 ఏప్రిల్ 20న ప్రారంభించారు. మొదటి చిత్రం అక్బర్ సలీం అనార్కలి.వాస్తవానికి దీని రిలీజ్ డేట్ ఆ నెల 15. కానీ అప్పటికి కొన్ని పనులు పెండింగ్ లో ఉండిపోవడంతో అయిదు రోజులు ఆలస్యంగా విడుదల చేశారు. ఎన్టీఆర్ బాలకృష్ణలు అక్బర్ సలీంలుగా అద్భుతమైన నటన ప్రదర్శించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వారం పది రోజుల కన్నా ఎక్కువ రన్ దక్కించుకోలేకపోయింది. అతి తక్కువ గ్యాప్ తో మేలో వచ్చిన అమితాబ్ బచ్చన్ డాన్ కనివిని ఎరుగని స్థాయిలో ఏకంగా 525 రోజులు ప్రదర్సింపబడటం ఇప్పటికీ అరుదైన రికార్డుగా చెప్పకోవాలి. నాగార్జున గీతాంజలి ఉదయం ఆటలతో కలిపి 225 రోజులు ఆడింది.
బాలకృష్ణకు మాస్ లో మంచి ఫాలోయింగ్ తెచ్చిన మంగమ్మ గారి మనవడు సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం. నాగదేవత, అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సైతం 175 రోజులు ఆడాయి. శ్రీమతి ఒక బహుమతి లాంటి చిన్న సినిమా 125 రోజులు రన్ కావడం అప్పట్లో విశేషంగా చెప్పుకునేవారు. కమల్ హాసన్ భారతీయుడు వన్ సెవెంటీ ఫైవ్ డేస్ అడగా శంకర్ జీన్స్ శతదినోత్సవం జరుపుకుంది. ఇందులో హిందీ బ్లాక్ బస్టర్లు విరగబడి ఆడేవి. అమీర్ ఖాన్ రాజా హిందూస్థానీ తృటిలో రెండు వందల రోజులు మిస్ అయ్యిందని చెప్పుకునేవారు. తర్వాత కొంత కాలం సరైన మెయింటెనెన్స్ లేక బి గ్రేడ్ సినిమాలతో థియేటర్ ప్రతిష్ట కొంత మసకబారింది
కొన్నేళ్లు మూతబడ్డాక మళ్ళీ ఇప్పుడు సరికొత్త హంగులు తోడై ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమవుతోంది. మహేష్ బాబు, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ లాంటి స్టార్లతో మల్టీ ప్లెక్స్ బిజినెస్ చేస్తున్న ఏషియన్ ఈసారి నందమూరి కుటుంబానికి ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సింగల్ స్క్రీన్ ని ఎంచుకోవడం విశేషం. 975 సీట్ల కెపాసిటీని 590కి కుదించి అత్యాధునిక సౌకర్యాలతో రీ స్టార్ట్ చేయబోతున్నారు. అవతార్ 2 త్రీడి ఎక్స్ పీరియన్స్ కి సరికొత్తగా అందుకోవచ్చు. సునీల్ నారంగ్, భరత్ నారంగ్, సురేష్ బాబు, సదానంద గౌడ్ ఇందులో భాగస్వాములుగా ఉండబోతున్నారు. పాత కొత్త తరాలకు వారథిగా నిలిచిన తారకరామా కొత్త వెలుగును సంతరించుకోనుంది



