ఇదివరకు ఓసారి చెప్పుకున్నట్లు అది ప్రత్యేక హోదా కావచ్చు… బీసీ రిజర్వేషన్స్ కావచ్చు… మరొకటి కావచ్చు. అన్నీ రాజకీయ పార్టీలకు మాత్రమే ఉపయోగపడతాయి. అవి మాత్రమే వాటిని వాడుకుంటాయి. వాటి లాభనష్టాలు అవి మాత్రమే పొందుతుంటాయి… అటువంటి వాటిలో చాలా అరుదుగా ప్రజలకు లాభిస్తుంటాయి.
ఇప్పుడు ఆ హిస్టరీ పాఠాలు వినే ఓపిక ఎవరికీ లేదు. కనుక నేటి వార్తలలో తాజాగా ఉన్న తెలంగాణ బీసీ రిజర్వేషన్స్ పెంపు గురించి నాలుగు ముక్కలు చెప్పుకుందాం.
రాజ్యాంగం ప్రకారం అన్ని వర్గాలకు కలిపి రిజర్వేషన్స్ 50 శాతం మించకూడదు. కానీ తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ఖరారు చేస్తూ శాసనసభలో ఓ తీర్మానం, ఓ జీవో చేసింది. గవర్నర్ ఆమోదానికి పంపితే ఏం జరగాలో అదే జరిగింది.
కనుక సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అందరూ కలిసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఒక రోజు ధర్నా చేశారు. కానీ గొంగళి వేసిన చోటే ఉంది!
ఈలోగా స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేశాయి. వాటిలో బీసీ రిజర్వేషన్స్ అమలు చేస్తే బీసీలకు న్యాయం చేసిన పార్టీగా లబ్ది కలుగుతుందనో మరో ఆలోచనతోనో మరో జీవో జారీ చేసింది.
దానిని వ్యతిరేకిస్తూ హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి. ఈ విషయంలో రాజ్యాంగం ప్రకారమే నడుచుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకి వెళితే అది కూడా నేడు అదే చెప్పింది.
బీసీ రిజర్వేషన్స్ పెంపు సాధ్యం కాదని స్పష్టమైంది. కనుక ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపి మూడు పార్టీలు ఈ అంశంపై చెడుగుడు ఆట మొదలుపెట్టేశాయి.
బీసీలకు రిజర్వేషన్స్ ఇచ్చి వారికి న్యాయం చేద్దామనుకుంటే బీఆర్ఎస్, బీజేపి (కేంద్రం) సైంధవుడిలా అడ్డుకున్నాయని కాంగ్రెస్ వాదిస్తోంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కనుకనే బీసీ రిజర్వేషన్స్ పేరుతో ఈవిదంగా డ్రామాలు ఆడుతోందని బీజేపి, బీఆర్ఎస్ పార్టీలు వాదిస్తున్నాయి.
మూడు పార్టీలు బీసీల పట్ల తమకు మాత్రమే నిబద్దత ఉన్నాయని వాదిస్తూ మొదట జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళబోతున్నాయి. అంటే బీసీ రిజర్వేషన్స్ అమలు కాలేదు కానీ ఆ పేరుతో మూడు పార్టీలు రాజకీయాలు చేసుకోగలుగుతున్నయన్న మాట!






