ఒకటో తరగతి చదివే పిల్లాడి జ్ఞానం ఏబీసీడీలకే పరిమితం. ఆ పిల్లాడి ప్రపంచం అంతవరకే. రెండో తరగతిలో ఆ ఏబీసీడీలతోనే పదాలు ఉంటాయని అతనికి తెలియదు. అది అతని తప్పు కాదు. ఏ రంగానికైనా ముఖ్యంగా రాజకీయ నాయకులకు కూడా ఇదే వర్తిస్తుంది.
ఉదాహరణకు మాజీ సిఎం జగన్‌కు భోగాపురం విమానాశ్రయం వరకు మాత్రమే తెలుసు. అందుకే అప్పుడు దానికి మాత్రమే శంకుస్థాపన చేశారు. తద్వారా దాని క్రెడిట్ తీసుకోవాలనుకున్నారు.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు అంతకు మించి చాలా దూరం ఆలోచించగలరు. విమానాశ్రయంతో పాటు పైలట్ శిక్షణా కేంద్రం, విమానాల మరమత్తుల కేంద్రం, వాటి కోసం యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఓ సాంకేతిక కళాశాల కూడా అవసరమని భావించారు. అందుకే వాటన్నిటికీ తగ్గట్లుగా నాడు భూసేకరణ చేశారు. ఒకటో తరగతి పిల్లాడి వంటి జగన్‌కి ఇంత దూరం ఆలోచించలేరు. కనుక విమానాశ్రయానికి ఇన్ని వందల ఎకరాలు అవసరమా? అని ప్రశ్నించారు.
జగన్ ఒకటో తరగతి పిల్లాడైతే సిఎం చంద్రబాబు నాయుడు రెండో తరగతి పిల్లాడా? అని కొందరికి ధర్మసందేహం కలుగవచ్చు. ఆయన స్థాయి పీహెచ్‌డీ.
అక్కడితో అయన ఆగిపోలేదు. ఎప్పటికప్పుడు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకుంటారు. అవగాహన పెంచుకుంటారు, దానిని ఆచరణలో అమలుచేస్తుంటారు.
కానీ మన 1వ తరగతి విద్యార్ధి క్యూఆర్ కోడ్ ఉపయోగించడం వరకు అప్‌డేట్ అయ్యారు. భవిష్యత్తులో తప్పకుండా మరికొంత అప్‌డేట్ అవుతారు. కానీ సిఎం చంద్రబాబు నాయుడు యాంటీ వైరస్ సాఫ్ట్‌వేర్‌లా ప్రతీ రోజూ, ప్రతీ గంటకి అప్‌డేట్ అవుతూనే ఉంటారు. యువనాయకుడికి, ముసలాయనకి ఇదే తేడా!
ఇంతకీ విషయం ఏమిటంటే, మంత్రి నారా లోకేష్ నేడు విశాఖలో ఏవియేషన్, ఏరో స్పేస్, డిఫెన్స్ ఎడ్యుకేషన్ కోసం జీఎంఆర్-మాన్సాస్ ఎడ్యూసిటీకి శ్రీకారం చుట్టారు. ఇది 160 ఎకరాల విస్తీర్ణంలో ఇది ఏర్పాటు కాబోతోంది. ఈ మూడు రంగాలలో ఒకే చోట శిక్షణ ఇచ్చే ఏకైక సంస్థ దేశంలో ఇదే!




