ఎమ్మెల్సీ ఎన్నికలతో కంగుతిన్న వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే మళ్ళీ తేరుకొంటున్నట్లున్నారు లేదా ప్రతిపక్షాలపై ఎదురుదాడి చేస్తుండకపోతే మంత్రి పదవులు ఊడిపోతాయని కావచ్చు. ఒకరొకరుగా తమ అధినేత వైఖరికి అనుగుణంగా మీడియా ముందుకు వచ్చిమాట్లాడటం మొదలుపెట్టారు.
ఉత్తరాంద్ర పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో టిడిపి చేతిలో వైసీపీ ఓడిపోవడంతో సీదిరి అప్పలరాజు మంత్రి పదవి ఊడిపోబోతోంది. ఉత్తరాంద్రకే చెందిన విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణకి కూడా ఆ సెగ తగిలినట్లుంది. అందుకే ఆ ఓటమికి తాను నైతిక బాధ్యత వహిస్తున్నానని ముందే ఒప్పేసుకొన్నారు. గెలుపోటములు సహజం కనుక ఎక్కడ తప్పు జరిగిందో సమీక్షించి తెలుసుకొని సరిదిద్దుకొంటామని చెప్పారు.
అమరావతి రైతుల ఉద్యమం 1200 రోజులు పూర్తవడంతో అన్ని పార్టీల మద్దతు పెరుగుతుండటం వైసీపీకి ఆందోళన కలిగిస్తుంటే, మరోవైపు రాజధాని కేసుపై సుప్రీంకోర్టుని ఎంత ఒత్తిడి చేసిన్నప్పటికీ తీర్పు చెప్పకుండా పదేపదే వాయిదాలు వేస్తుండటంతో మూడు రాజధానులపై అడుగు ముందుకు వేయలేని పరిస్థితి నెలకొంది.
కానీ వైసీపీ పట్టిన కుందేలుకి మూడేకాళ్ళు అని గట్టిగా వాదించక తప్పదు కనుక బొత్స సత్యనారాయణ కూడా తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడి ఉందని, వచ్చే ఎన్నికలలో అదే అంశంతో ప్రజలని ఓట్లు అడుగుతామని చెప్పారు. ఈ కోర్టు కేసులు, చిక్కులు లేకపోతే రేపే విశాఖకు రాజధాని మార్చేయాలని కోరుకొంటున్నానని అన్నారు.
విశాఖని రాజధాని చేస్తామని చెపుతున్నా విశాఖ ప్రజలతో సహా ఉత్తరాంద్రలో ఆ సెంటిమెంట్ ఏర్పడలేదనుకోవడం సరికాదని, ప్రజలందరూ విశాఖ రాజధాని కావాలనే కోరుకొంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు.
అమరావతి ఓ శ్మశానం అంటూ గతంలో చేసిన వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ హటాత్తుగా యూటర్న్ ఎందుకు తీసుకొన్నారో తెలీదు కానీ దానికి ఆయన ఇచ్చిన తాజా సంజాయిషీ చాలా హాస్యాస్పదంగా ఉంది. “ప్రతీ ఊరులో శ్మశానం ఉంటుంది కనుక ఆ ఉద్దేశ్యంతోనే నేను అమరావతిని శ్మశానమని అన్నాను తప్ప వేరే ఉద్దేశ్యంతో కాదని,” అవసరం లేకపోయినా బొత్స సత్యనారాయణ ఇప్పుడు సంజాయిషీ ఇచ్చుకోవడం గమనార్హం.
మూడు రాజధానులు, విశాఖ రాజధాని సాధ్యం కాదని వైసీపీ అధినేత గ్రహించి అమరావతిలోనే ఫిక్స్ అయిపోదామనుకొంటున్నారేమో? లేదా ఎన్నికలు దగ్గర పడేసరికి మళ్ళీ అమరావతినే రాజధానిగా చేస్తామని మరోసారి ప్రజలను మభ్యపెట్టేందుకు సిద్దం అవుతున్నారేమో?కానీ మూడు రాజధానులు, విశాఖ రాజధానిపై కూడా మాట మార్చేసి, మడమ తిప్పేశామని ప్రజలు, ప్రతిపక్షాలు ఎద్దేవా చేస్తాయని ముందుగానే ఇలా చిన్న చిన్నగా టర్నులు తీసుకొంటూ ఎన్నికలు దగ్గర పడినప్పుడు పూర్తి యూ టర్నింగ్ తీసుకోవాలని వైసీపీ నిర్ణయించుకొందేమో?
ఏది ఏమైనప్పటికీ ఒకవేళ వైసీపీ నేతలలో అమరావతిలోనే ఉండిపోవాలనే ఆలోచన ఉన్నట్లయితే, “మా మూడు రాజధానుల ఆలోచన తప్పని గ్రహించాము. అమరావతినే రాజధానిగా అంగీకరిస్తున్నామని” నిర్మొహమాటంగా ప్రకటించేసి మళ్ళీ నిర్మాణ పనులు మొదలుపెడితే వైసీపీ తక్కువ నష్టంతో బయటపడే అవకాశం ఉంటుంది లేదా బొత్స చెప్పుకొన్నట్లు ధైర్యంగా ఆ మూడు కాళ్ళ కుందేలుతో ఎన్నికలకు వెళ్ళినా ఎవరికీ అభ్యంతరం లేదు.



