ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈరోజు ఏపీ విద్యా సవరణ బిల్లు-2023ని శాసనమండలిలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, “ఉపాధ్యాయుల పదవీ విరమణ వయోపరిమితిని రెండేళ్ళు పెంచినందునే కొత్తగా ఖాళీలు ఏర్పడలేదు. అందుకే డీఎస్సీ తీయలేదు. ఖాళీలు లేనప్పుడు డీఎస్సీ ఎలా తీయగలము?ఇంత వివరంగా చెపితే నాకు రెండు రెండే మార్కులు వేస్తానని పిడిఎఫ్ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. అందుకు బదులుగా ఆదేరోజున నాకు రెండువేల మెసేజులు వచ్చాయి. ఇంతకీ ఉపాధ్యాయులు పదవీ విరమణ వయోపరిమితిని పెంచాలా వద్దా?మీరే చెప్పండి?డీఎస్సీ కోసం కసరత్తు ప్రారంభించాం. ఇప్పుడు నాకు ఎన్ని మార్కులు వేస్తారో చెప్పండి?” అంటూ పిడిఎఫ్ సభ్యులను మంత్రి బొత్స నిలదీశారు.
ఉపాధ్యాయులుగా అపారమైన అనుభవం, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి పూర్తి అవగాహన, సాధికారత కలిగి, విద్యావ్యవస్థతో వైసీపీ చేస్తున్న ప్రయోగాలతో జరుగుతున్న నష్టాల గురించి పూర్తి అవగాహన కలిగిన వారిని ఈ విదంగా ప్రశ్నించినందుకు మంత్రి బొత్స సత్యనారాయణకు వారి నుంచి చాలా ఘాటు సమాధానమే వచ్చింది.
పిడిఎఫ్ సభ్యులు జవాబిస్తూ, “పదవీ విరమణ వయసును పెంచాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఏవీ కోరలేదు. మీ వైసీపీ రాజకీయ అవసరాల కోసమే పెంచుతోంది. ఎలాగూ పెంచుతున్నారు కనుక రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులందరికీ ఈ ప్రయోజనాలను వర్తింపజేస్తే చాలా సంతోషం,” అని అన్నారు.
నిజానికి నెలనెలా సకాలంలో జీతాలే చెల్లించలేకపోతున్న రాష్ట్ర ప్రభుత్వం, పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులకు లక్షల రూపాయల రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించలేకనే రెండేళ్ళు పొడిగించి, తన సమస్యను రెండేళ్ళకు వాయిదా వేసుకొందని ఉపాధ్యాయులు భావిస్తున్నారు.
ఉపాధ్యాయుల పదవీ విరమణ వయోపరిమితిని రెండేళ్ళు పొడిగించడం వలననే ఖాళీలు ఏర్పడలేదని, అందువల్లే డీఎస్సీ తీయలేకపోయామని మంత్రి బొత్స సత్యనారాయణ స్వయంగా సభలో చెప్పుకొన్నారు. మరి అటువంటప్పుడు మళ్ళీ డీఎస్సీ కోసం కసరత్తు చేస్తున్నామని చెప్పడాన్ని ఏమనుకోవాలి?
ఈ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం వేలాదిమంది నిరుద్యోగ యువత గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి హాస్టల్స్ లో ఉంటూ వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్ సెంటర్లలో శిక్షణ తీసుకొంటుంటారు. ఉపాధ్యాయులు పదవీ విరమణ వయోపరిమితిని మరో రెండేళ్ళు పెంచడం వలన అంతవరకు ఖాళీలు ఏర్పడకపోతే ఆలోగా వారిలో అనేక మంది నిరుద్యోగులకు వయసు పెరిగి ఉద్యోగాలకు అనర్హులవుతారు కదా?మరో రెండేళ్ళవరకు ఖాళీలు ఏర్పడక, డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకాకపోతే వారందరి పరిస్థితి ఏమిటి?అయినా ఉద్యోగ సంఘాలు కోరనప్పుడు ప్రభుత్వం పదవీ విరమణ వయోపరిమితిని పెంచవలసిన అవసరం ఏంటి?



