ముందస్తు గంట మ్రోగించి భయపడటం దేనికి?

Botsa Satyanarayana on Early Elections in Andhra Pradeshఆంధ్రప్రదేశ్‌లో తప్పకుండా ముందస్తు ఎన్నికలు వస్తాయని, కనుక పార్టీ శ్రేణులు అందరూ సిద్దంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పదేపదే చెపుతున్నారు. అయితే ఆయన ముందస్తు ఎన్నికలు జరగాలని కోరుకొంటే వచ్చేయవని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాష్ట్రాని 5 ఏళ్ళు పాలించమని ప్రజలు వైసీపీకి ఓట్లేసి అధికారం అప్పజెప్పారని కనుక పదవీకాలం పూర్తయ్యే వరకు ఎన్నికలు నిర్వహించే ప్రసక్తేలేదని చెప్పారు.

మంచిదే. ప్రజలెన్నుకొన్న ప్రభుత్వం పూర్తి పదవీ కాలం అధికారంలో ఉండి పాలన, రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలనే అందరూ కోరుకొంటారు. అందుకే రాజ్యాంగంలో 5 ఏళ్ళు గడువు పెట్టారు. కానీ ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉండగా మొదట ఆ ప్రస్తావన తెచ్చింది సాక్షాత్ సిఎం జగన్మోహన్ రెడ్డే కదా?తక్షణమే గడప గడపకు వెళ్ళమని చెప్పింది ఆయనే కదా?

ADVERTISEMENT

ముందస్తు ఆలోచన లేకపోతే ఇప్పటి నుంచే వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, పార్టీ నేతలు గడపలు పట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది? సింగిల్ సింహం, దత్తపుత్రుడు ఇవన్నీ వైసీపీయే కదా మొదలుపెట్టింది?ఇద్దరు బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చి రాష్ట్రంలో బీసీలందరినీ ఉద్దరిస్తున్నట్లు చెప్పుకొంటున్నది దేనికి?ఎన్నికల కోసమే కదా?

చంద్రబాబు నాయుడు కోరుకొన్నారనో లేదా సిఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారనో కాకపోయినా రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గడప గడపకి కార్యక్రమంలో ఎదురవుతున్న చేదు అనుభవాలతో సంక్షేమ పధకాలు తమను గెలిపించలేవని వైసీపీ నేతలు ఇప్పటికే గ్రహించి ఉంటారు.

ఇప్పటికే అయినకాడికి అప్పులు చేసి పధకాలకు ఖర్చు పెడుతుండటంతో కొత్తగా అప్పులు పుట్టే పరిస్థితులు లేవు. కానీ పధకాలకు అలవాటుపడిన జనాలకు టంచనుగా డబ్బు చెల్లించకపోతే మొదటికే మోసం వస్తుంది.

ఇక మళ్ళీ లేచి నిలబడలేదనుకొన్న టిడిపి లేచి నిలబడటమేకాక ‘బాదుడే బాదుడు అంటూ తమ ప్రభుత్వాన్ని బాదుతుండటం, మరోపక్క టిడిపితో పొత్తులకి సిద్దమవుతున్న జనసేన హడావుడి ప్రమాద ఘంటికలు మ్రోగిస్తున్నాయి. పవన్ కళ్యాణ్‌ టిడిపితో చేరితే బిజెపి పరిస్థితి మళ్ళీ మొదటికొస్తుంది కనుక ఆయనతో పాటే బిజెపి కూడా టిడిపితో దోస్తీకి సిద్దపడినా ఆశ్చర్యం లేదు. కనుక ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని భావించవచ్చు.

మంత్రి బొత్స చెప్పినట్లు చంద్రబాబు నాయుడు కోరుకొన్నంత మాత్రన్న ముందస్తు ఎన్నికలు రావు కానీ సిఎం జగన్మోహన్ రెడ్డి తలుచుకొంటేనే వస్తాయి. ఇప్పుడు ఆయనే స్వయంగా ముందస్తు గంట కొట్టారు. కానీ అది ఆ సౌండ్ కాదని వాదించడం దేనికి?

వీలైతే మంత్రి బొత్స సత్యనారాయణ వంటి సీనియర్లు తమ అధినేతకు నచ్చజెప్పి ఈ ఆలోచనను విరమించుకొని పూర్తికాలం ప్రభుత్వాన్ని నడిపించాలని సలహా ఇస్తే ఇటువంటి ఊహాగానాలుండవు. అప్పుడు వారు ఆందోళన చెందాల్సిన అవసరం కూడా ఉండదు కదా?కానీ పిల్లి మెడలో గంటెవరు కడతారన్నట్లు సీనియర్లు సైతం జంకుతూ ఈవిదంగా ఖండనలతో కాలక్షేపం చేస్తుంటే వారు భయపడుతున్నట్లే వారి చాపల కిందకు నీళ్ళు ముందస్తుగానే వచ్చేస్తాయి.

ADVERTISEMENT
Latest Stories