మంత్రి బొత్స మళ్ళీ నోరు జారారా?

botsa satyanarayana tongue slip againడ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు కోసం పోలీసులు గాలిస్తుంటే, మంత్రి బొత్స సత్యనారాయణ అతను ఓ పెళ్ళికి వెళ్ళారని చెప్పడం విశేషం.

మంత్రి బొత్స సత్యనారాయణ శ్రీకాకుళంలో నిన్న వైసీపీ కార్యాలయంలో మాట్లాడుతూ, “మా ప్రభుత్వంలో చట్టానికి చుట్టాలు ఎవరూ లేదు. అందరూ సమానమే. డ్రైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు మొదటి రోజే పోలీసులకు వాంగ్మూలం ఇచ్చి ఉంటే, ఎమ్మెల్సీ అనంత బాబును ఆరోజే పోలీసులు అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ అనవసరమైన అనుమానాలు, అపోహలతో రెండు రోజులు ఆలస్యం చేశారు. అయినా ఎమ్మెల్సీ అనంత బాబు ఎవరిదో ఓ పెళ్ళికి వెళ్ళినట్లు వార్తలలో చూశాను. ఆయన ఏ తప్పు చేయలేదని భావిస్తున్నందునే నిర్భయంగా బయట తిరుగుతున్నారని భావిస్తున్నాను,” అని అన్నారు.

ADVERTISEMENT

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో నేరం జరిగిన ప్రతీసారి మంత్రులు, పోలీసులు ఇంచుమించు ఇదేవిదంగా వ్యవహరిస్తున్నారు… ఇదేవిదంగా మాట్లాడుతున్నారు.

పదో తరగతి పేపర్స్ లీక్ అయ్యాయని సిఎం జగన్మోహన్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ చెప్పగా, అటువంటిదేమీ జరగలేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కానీ మర్నాడే మాజీ మంత్రి నారాయణను హైదరాబాద్‌లో అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరిచారు.

విజయవాడ ఆస్పత్రిలోనే ఓ మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు, మొదట పోలీసులు పట్టించుకోలేదు. చంద్రబాబు నాయుడు గట్టిగా నిలదీసేసరికి మహిళా కమీషన్‌ ఆయనకే నోటీసులు పంపించింది. చివరికి ఈ కేసులో పోలీసులు చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి స్వయంగా ఒప్పుకొని వారిని సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు అన్ని తెలుగుదేశం పార్టీ, దాని అనుకూల మీడియాయే చేయిస్తున్నాయని సిఎం జగన్మోహన్ రెడ్డి ఆరోపించడం చూసి అందరూ దిగ్బ్రాంతి చెందారు. కానీ ఇప్పుడు అధికార వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడుగా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సమాధానం చెప్పగలరా?

హత్య జరిగినప్పటి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పరారీలో ఉన్నారని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు చెపుతుంటే అనంత బాబు పెళ్ళికి వెళ్ళారని మంత్రి బొత్స సత్యనారాయణ చెపుతున్నారు. రెంటిలో ఏది నిజం?

పైగా ఈ కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు ప్రధాన నిందితుడని పోలీసులు చెపుతుంటే, “అతను ఏ నేరం చేయలేదు కనుకనే నిర్బయంగా బయట తిరుగుతున్నారని,” మంత్రి బొత్స సత్యనారాయణ తీర్పు చెప్పడం ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులపై ప్రభావం చూపుతున్నట్లు కాదా?అంటే అనంత బాబును పోలీసులు అరెస్ట్ చేసి పట్టుకొన్నా ఈ కేసులో అతనిని బయటపడేయాలన్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ముందే పోలీసులకు సూచిస్తున్నట్లుగా భావించాలా? అంటే అవుననే అనుకోవాలేమో?

ఎప్పటిలాగే ఈ కేసులో నిందితుడిని పట్టుకోకుండా బాధిత కుటుంబాన్ని అదుపులో తీసుకోవడం, ఇప్పుడు వారి నిర్లక్ష్యంగా కారణంగానే పోలీసులు వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబుని అరెస్ట్ చేయలేకపోయారని మంత్రి బొత్స సత్యనారాయణ నిందిస్తున్నారు.

వేరే పార్టీలలో వారు ఎవరైనా అయితే ఇటువంటి కేసులలో చిక్కుకొన్నప్పుడు ఆయా పార్టీలు వారిని పార్టీలో నుంచి బహిష్కరిస్తుంటాయి. కానీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఈవిదంగా ముందే క్లీన్ చిట్ ఇచ్చి వెనకేసుకు వస్తుండటం విశేషం!

ADVERTISEMENT
Latest Stories