రేపు ఏపీ శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు జరుగబోతుంటే కేసీఆర్ గురించి చెప్పుకోవడం అసందర్భమే అనిపిస్తుంది. కానీ కేసీఆర్ నిన్న మీడియా సమావేశంలో “వైసీపి, బిఆర్ఎస్, ఆమాద్మీ , తృణమూల్ కాంగ్రెస్ వంటి ప్రాంతీయ పార్టీలు కలిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాయని” చెప్పారు. కనుక రేపు ఆంధ్రాలో ఓట్లు వేసే ప్రతీ ఒక్కరూ ఆలోచించి వేయడం చాలా అవసరం.
కేసీఆర్ ఏమన్నారంటే, ఈసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ లేదా ఇండియా కూటమి అడ్రస్సే ఉండదు. కనుక తమవంటి ప్రాంతీయ పార్టీలు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తిరిగి అవే మద్దతు ఈయాల్సి ఉంటుందని చెప్పారు. ప్రధానమంత్రి రేసులో తాను కూడా ఉన్నానని కేసీఆర్ మనసులో మాట చెప్పేశారు.
గత లోక్‌సభ ఎన్నికలలో కేసీఆర్ ఇలాగే ‘కారు..సారు.. ఢిల్లీ సర్కారు…’ అంటూ చాలా హడావుడి చేశారు. తమని గెలిపిస్తే మోడీ మెడలు వంచుతా. ఢిల్లీలో చక్రం తిప్పుతానన్నారు. కానీ ఆ తర్వాత ఏమి జరిగిందో తెలుసు.
ఈసారి కేసీఆర్ అధికారం కోల్పోయి ఇంకా దయనీయ పరిస్థితులలో ఉన్నారు. కనుక తెలంగాణలోని 17 ఎంపీ సీట్లలో కనీసం 5-6 సీట్లయినా గెలిపించుకుని తన పార్టీని కాపాడుకునేందుకే కేసీఆర్ ఈవిదంగా తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మనం కొట్టి పడేయవచ్చు.
కానీ ఆయన చెప్పిన దాని ప్రకారం అవసరమైతే లోక్‌సభ ఎన్నికల తర్వాత వైసీపి, బిఆర్ఎస్ పార్టీలు కలిసి పనిచేస్తాయని అర్దమవుతోంది. అందుకే జగన్ గెలుస్తారని, గెలవాలని కేసీఆర్ చెపుతున్నట్లు అర్దమవుతోంది.
కేసీఆర్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రెండుసార్లు దారుణంగా దెబ్బ తీసారు. అ తర్వాత కూడా నదీ జలాల పంపిణీ, ఆస్తుల విభజన, ఏపీకి చెల్లించాల్సిన బకాయిలు, చివరికి నాగార్జునసాగర్-శ్రీశైలం రిజర్వాయర్‌లో నీళ్ళ వాడకంపై కేసీఆర్ ఎన్ని పేచీలు పెడుతున్నారో అందరికీ తెలుసు. అయినా కేంద్రంలో చక్రం తిప్పడానికి వైసీపి సాయం తీసుకోవాలని అనుకుంటున్నారు. అంటే కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇంకా విడిచిపెట్టలేదని అర్దమవుతోంది.
కేసీఆర్‌కు తెలంగాణలో మళ్ళీ అధికారంలోకి రావడం చాలా ముఖ్యం కావచ్చు. ప్రధాన మంత్రి కావాలనే కోరిక ఉండొచ్చు. కానీ దాని కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వేలుపెట్టి, ఓ రాజకీయ పార్టీని వాడుకోవాలని అనుకోవడం చాలా దారుణమే కదా?
కనీసం 17 ఎంపీ సీట్లు కూడా సాధించలేని కేసీఆర్ పగటి కలలు ఫలిస్తాయా లేదా?అనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం కలిగిస్తున్న అటువంటి వ్యక్తితో ఎవరు చేతులు కలపాలనుకున్న వారిని ఖచ్చితంగా ఓడించాల్సిందే. లేకుంటే కేసీఆర్ రాజకీయ చదరంగంలో ఆంధ్రప్రదేశ్ పావుగా మిగిలిపోతుంది. మరోసారి తీవ్రంగా నష్టపోతుంది. మరోసారి నష్టపోతే ఇక ఆంధ్రప్రదేశ్ కోలుకోవడం చాలా కష్టమే.




