మున్సిపల్ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ఓటమిపై సోషల్ మీడియాలో జోకులు తపాకాయలా పేలుతున్నాయి. వాటిలో ఒకటి, “తెలంగాణ మునిసిపల్ ఎలక్షన్స్‌లో జగనన్న ప్రభావం.. బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్‌గా జగనన్న సైన్యం! ఎక్కడ చూసినా భారీ మెజారిటీలు స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ… పులి ఎక్కడున్నా ఫూలే అంటున్న వైసీపీ శ్రేణులు.”
వైసీపీ, బీఆర్ఎస్ పార్టీ అధినేతలు కేసీఆర్, జగన్ మద్య చాలా బలమైన బంధం ఉంది. అలాగే వారి మీడియాల మద్య కూడా. రెండు పార్టీలు, రెండు మీడియాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ముందుకు సాగుతుంటాయి.
ఇక్కడ వైసీపీ, దాని సొంత మీడియా కూటమి ప్రభుత్వం, సిఎం చంద్రబాబు నాయుడుపై నిత్యం విషం కక్కుతుంటే, అక్కడ బీఆర్ఎస్ సొంత మీడియా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రాన్ని దోచేసుకుంటున్నారంటూ కధనాలు ప్రచురిస్తుంటుంది.
తెలంగాణలో ఆంధ్రావాళ్ళు లక్షల మంది ఉన్నారు. వారిలో టీడీపి, వైసీపీ, జనసేన, బిజేపిల అభిమానులు లేదా మద్దతుదారులు ఉన్నారు. కనుక ప్రతీ ఎన్నికలలో వారి ఓట్లు కీలకంగా మారుతుంటాయి. మున్సిపల్ ఎన్నికలలో కూడా అలాగే బీఆర్ఎస్ పార్టీకి తోడ్పడి ఉంటారు. తోడ్పడితే తప్పు లేదు.
కానీ ఏపీ తెలంగాణ సిఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిస్తే తెలంగాణని దోచుకోవడానికే అని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తున్నప్పుడు, వైసీపీతో లోపాయికారీ స్నేహాన్ని అది ఏవిధంగా సమర్ధించుకోగలదు?
అయినా రెండు పార్టీల నేతలకు నోటి దురుసు, అహంభావం వంటి కొన్ని అవలక్షణాలు ఉన్నాయి. వాటి వల్లనే వారు, వారి పార్టీలు నష్టపోయాయి. కానీ నేటికీ ఆత్మవిమర్శ లేదు. పశ్చాతాపం కనిపించదు. కనుక మార్పు కూడా రాదు. అలాంటప్పుడు ఫలితాలు, పర్యవసానాలు కూడా తదనుగుణంగానే ఉంటాయి… ఎంత కలిసి పనిచేసినా!






